అద్దెకు అధ్యాపకులు కావలెను! | Sakshi
Sakshi News home page

అద్దెకు అధ్యాపకులు కావలెను!

Published Sat, Apr 2 2016 2:28 AM

అద్దెకు  అధ్యాపకులు కావలెను! - Sakshi

రోజుకు రూ.10 వేల నుంచి రూ.లక్ష చెల్లింపు
ఇంజనీరింగ్ కాలేజీల్లో  కొనసాగుతున్న తనిఖీల పర్వం
గండం గట్టెక్కేందుకు యాజమాన్యాల జిమ్మిక్కులు
ఇంజనీరింగ్ కాలేజీల్లో కనిపించని ప్రమాణాలు
నకిలీ అధ్యాపకులని తేలితే క్రిమినల్ కేసు నమోదు
 

మీరు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లా... అయితే రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష సంపాదించే సువర్ణావకాశం. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తే కాదు... ఒక్కరోజు కనిపిస్తే చాలు రూ.లక్ష మీ సొంతమైనట్లే! ఎందుకంటే ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏఐసీటీఈ అధికారుల తనిఖీల పర్వం కొనసాగుతోంది. ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్యలో ఫ్యాకల్టీ లేని కళాశాలలకు గుర్తింపు గండం పొంచి ఉంది. దీంతో ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ఒక్కరోజు అద్దె ఫ్యాక ల్టీ కోసం పలు కాలేజీల యూజమాన్యాలు అన్వేషిస్తున్నారు.

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /కమాన్‌చౌరస్తా:-
 కట్టుదిట్టంగా తనిఖీలు..
గతంలో అధ్యాపకులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు యూనివర్సిటీకి, ఏఐసీటీఈకి పంపిచాల్సిన అవసరం ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు ఉండేది కాదు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు డూప్లికేట్ అధ్యాపకులను చూపించి తనిఖీల గండాన్ని దాటి హమ్మయ్య అనుకునేవారు. కానీ ఇప్పుడు డూప్లికేట్ అధ్యాపకులను గుర్తిచండానికి ప్రతి అధ్యాపకుడి సర్టిఫికెట్‌లతోపాటు అధార్ నంబర్, పాన్‌నంబర్, తదితర వ్యక్తిగత వివరాలతోపాటు కళాశాల ల్యాబ్‌లోని పరికరాలు, ఇతరత్రా విషయాలన్నింటినీ జేఎన్‌టీయూ సేకరించింది. సంబంధిత కళాశాలలు అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం తనిఖీలు చేస్తోంది. ఎక్కడైనా ఆప్‌లోడ్ చేసిన వాటిలో తేడాలు గుర్తిస్తే కేసులు నమోదు చేసేందుకు కూడా వెనకాడేదిలేదని ప్రభుత్వం ఇటీవల హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలోని మెజారిటీ కళాశాలలు త నిఖీలను ఎదుర్కోగా ఇంకా రెండు, మూడు కాలేజీలకు ఈ నాలుగైదు రోజుల్లో తనిఖీల సెగ ఉంటుందని సమాచారం.


 కొనసాగుతున్న జిమ్మిక్కులు
ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత తగ్గుతోందని గుర్తించిన ప్రభుత్వం... కళాశాలల్లో ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని భావించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పుట్టుకొచ్చిన కళాశాలలు తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల కొన్నింట్లో ప్రవేశాలు తగ్గడంతో మూతపడ్డాయి. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు మాత్రం అధికారుల కళ్లుగప్పి ఇంకా కనికట్టు చేస్తూ కొనసాగుతున్నాయి. నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు పరుచని పలు యాజమన్యాలు రాజకీయ బలం ఉపయోగించగా, మరికొన్ని యూజమాన్యలు ధనబలం ప్రదర్శించి తనిఖీల నుంచి బయటపడుతున్నట్లు సమాచారం. పలు విద్యాసంస్థల్లో రెండు మూడు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌తోపాటు ఇతర కాలేజీలున్నారుు. అప్పుడు ల్యాబ్‌లో ఉండాల్సిన పరికరాలు తనిఖీల సమయంలో అక్కడ నుంచి ఇక్కడికి తరలిస్తూ అధికారుల కళ్లు కప్పుతున్నారు. అధికారులు మాత్రం తనిఖీల సందర్భంగా ఇలాంటి విషయాలను పట్టించుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.

 నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి
 ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత కావాలంటే అర్హులైన బోధనా సిబ్బందికి తగ్గట్టుగా బోధనేతర సిబ్బంది కూడా ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రతి ప దిహేను మంది విద్యార్థులకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. ప్రతి విభాగానికి సరిపడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు ఉండాలి. రికార్డుల్లో మాత్రం నిర్ణీత సంఖ్యలో అధ్యాపకులున్నట్లుగా చూపుతున్నప్పటికీ... తని ఖీల సమయంలో మినహా సాధారణ రోజుల్లో వాళ్లెవరూ కనిపించని పరిస్థి తి. మన జిల్లాలోని పేరు మోసిన కళాశాలల్లో సైతం విభాగాధిపతులుగా గతంలో తనిఖీల సమయంలో బయటి నుంచి వచ్చిన వారినే చూపించిన సందర్భాలున్నారుు.

ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒక కళాశాలలో ఉన్న అధ్యాపకుడిని ఇంకో కళాశాలలో చూపించే అవకాశం లేకపోవడంతో తనిఖీలంటే యూజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారుు. కొన్ని కళాశాలలు దీనికోసం ముందు నుంచే కావాల్సిన అభ్యర్థులను వెతుక్కొని తమ వద్ద సర్టిఫికెట్‌లు ఉంచితే నెలకు రూ.3-5వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. తనిఖీల సమయంలో కళాశాలకు వచ్చినప్పుడు అదనంగా రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్రమే. ప్రొఫెసర్లకు దాదాపు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక కళాశాలలో చూపించిన అధ్యాపకున్ని మరో కళాశాలలో చూపిస్తే సర్టిఫికెట్‌లు రద్దు చేయడంతోపాటు కేసులు సైతం నమోదు చేయనున్నట్లు యూనివర్సిటీ హెచ్చరించింది.

దీంతో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గిరాకీ పెరిగింది. ఇందులో భాగంగా విద్యాసంస్థలు తనిఖీల సమయంలో ఆయా కళాశాలల్లో ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులను వెతుకుతున్నట్లు సమాచారం. మరికొన్ని కళాశాలలు డబ్బులు చెల్లించి తనిఖీల సమయంలో ఇబ్బందిపడే బదులు.. ఏ టెన్షన్ లేకుండా ఇటీవలే అధ్యాపకులను నియమించుకొని తనిఖీలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement