హామీలు ఏమయ్యాయి? | Sakshi
Sakshi News home page

హామీలు ఏమయ్యాయి?

Published Mon, Dec 29 2014 11:38 PM

హామీలు ఏమయ్యాయి? - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అర్హులైన నిరుపేదలందరికీ స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు 125గజాల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను త్వరితంగా ప్రారంభించాలని డిమాండ్ చేసింది. ఇళ్లు, స్థలాలను కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ధర్నా నిర్వహించింది.

ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో ఎన్నోసార్లు ఉద్యమాలు చేపట్టామని, కానీ ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలే అయ్యాయని అన్నారు. హయత్‌నగర్ మండలంలోని వేల ఎకరాల భూములు సంఘీ, రామోజీరావు గుప్పి ట్లో ఉన్నాయని, వారినుంచి చట్ట ప్రకా రం భూములను వెనక్కు తీసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరుణం లో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేయాలన్నారు. ధర్నా లో భాగంగా కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనాలు పెద్ద సంఖ్యలో రావడం, మరోవైపు కలెక్టరేట్ ఎదుట మెట్రోరైలు పనులు జరుగుతున్నందున పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు వచ్చేవరకు ధర్నాను ఆపేదిలేదని తేల్చడంతో.. జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు వారి వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. పేదల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement