ఇక నిరంతరం ‘జనహిత’ | Sakshi
Sakshi News home page

ఇక నిరంతరం ‘జనహిత’

Published Thu, Jul 20 2017 4:16 AM

ఇక నిరంతరం ‘జనహిత’ - Sakshi

రోజూ ప్రజావిన్నపాల స్వీకరణ
అర్జీ కోసం సోమవారం దాకా ఆగాల్సిన పనిలేదు
ఫోన్, వాట్సాప్, మెయిల్‌ ద్వారా చెప్పుకోవచ్చు


సాక్షి, సూర్యాపేట: ఇన్నాళ్లూ కలెక్టర్‌ను కలసి తమ సమస్యలు చెప్పుకునేందుకు సామాన్యులు ‘సోమ వారం’ దాకా ఎదురుచూసేవారు . ఊరు నుంచి ఆటో, బస్సు పట్టుకుని జిల్లా కేంద్రానికి పరుగులు తీసేవారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావిజ్ఞప్తుల దినంలో అధికారులను కలసి అర్జీలు పెట్టుకునేవారు.

అర్జీ పరిష్కారమైందీ లేనిదీ తెలుసు కునేందుకు మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు రావాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  సామా న్యులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పనిదినాల్లో సమస్యలు విన్నవించుకునేలా, సత్వర పరిష్కారం పొందేలా ప్రభుత్వం ‘జనహిత’ ఆన్‌లైన్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. బుధవారం సూర్యాపేట జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ‘జనహిత’ ఆగస్టు నుంచి తెలంగాణ అంతటా అమలులోకి రానుంది.  

ప్రజా విజ్ఞప్తుల దినం రోజునే అర్జీదారులు ఆందోళన కు దిగడం, కొన్ని జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌  ‘జనహిత’కు రూపకల్పన చేశారు. అమలు బాధ్యతలను తెలం గాణ ఐటీ శాఖపై మోపారు. ప్రజలు తమ సమస్య లను నేరుగా ఎక్కడి నుంచైనా చెప్పుకొనేందుకు వీలు గా ‘జనహిత’ వెబ్‌ పోర్టల్‌ను తీర్చిదిద్దింది.  ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా తెలియజేయవచ్చు. జనహిత వెబ్‌పోర్టల్‌లో నమోదైన సమస్యలను నిర్ణీత కాలంలో అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయి.

సూర్యాపేటలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం
సూర్యాపేటలో ‘జనహిత’ వెబ్‌పోర్టల్‌ సేవలను  విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.www.janahitha.telanga na.gov.in వెబ్‌పోర్టల్‌కు అనుసంధానంగా కాల్‌ సెంటర్‌ ఉంటుంది. సూర్యాపేట కలెక్టరేట్‌లోని కాల్‌ సెంటర్‌ నంబర్‌ 94941 81920కు ఫోన్‌ చేసి లేదా ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ ద్వారా ప్రజలు తమ సమస్య లను విన్నవించుకోవచ్చు. మొదటి రోజు రెండు విజ్ఞప్తులు వచ్చాయి.

Advertisement
Advertisement