‘స్వచ్ఛ’మేవ జయతే! | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’మేవ జయతే!

Published Sat, May 16 2015 2:10 AM

‘స్వచ్ఛ’మేవ జయతే!

- మహా క్రతువుకు నేడు ప్రభుత్వం సిద్ధం
- రంగంలో అమాత్యులు...అధికార యంత్రాంగం
- ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం
స్వచ్ఛతే సత్యం... నిత్యం. అందరికీ ఆరోగ్యదాయకం. విశ్వనగరానికి ప్రాణపదం.
సాక్షి, సిటీబ్యూరో: ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగు పడునోయ్..!’ అన్నాడు మహాకవి గురజాడ. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే... సమాజం ఆరోగ్యంగా ఉండాలి. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే... పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే... ముందుగా చెత్తను వదిలించాలి. మనుషుల రుగ్మతలకు...రోగగ్రస్త వ్యవస్థకు ప్రథమ కారణం ఇదే. ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పేరుకుపోతున్న చెత్త.. అందులోని విషతుల్య పదార్ధాలు సమాజంపై పెనుప్రభావం చూపుతున్నాయి. స్వచ్ఛమైన గాలి.. నీరు.. పరిసరాలు లేక నగర పౌరుల్లో అధిక శాతం అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’ నినాదంతో మహాయజ్ఞాన్ని నిర్వహిస్తోంది. దీనికి అన్ని రంగాల వారి సేవలనూ వినియోగించుకుంటోంది. గవర్నర్, సీఎం సహా మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారులూ ఈ ‘స్వచ్ఛ’మైన క్రతువులో పాలు పంచుకుంటున్నారు. క్రీడా, సినీ రంగాల ప్రముఖులూ వీరితో చేయి కలపనున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అందరం భాగస్వాములమవుదాం. ‘స్వచ్ఛ హైదరాబాద్’ను సాధిద్దాం.
 - పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ      
- వ్యర్థాల నుంచి విముక్తి అవసరం      
- అప్పుడే ‘స్వచ్ఛ హైదరాబాద్’కు సార్థకత

ప్లాస్టిక్  మహమ్మారి
- భాగ్య నగరంలో రోజుకు 4,200 టన్నుల చెత్త వెలువడుతోంది. అందులో ప్లాస్టిక్ వాటా 198.24 టన్నులు. అంటే 4.72 శాతం.
- ప్లాస్టిక్ వ్యర్ధాల్లో సింహ భాగం వాటా ప్లాస్టిక్, ప్యాకేజింగ్ కవర్లదే.  
- వీటిని తగ్గించే ప్రయత్నంలో 2011 జులై 1 నుంచి నగరంలో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా... ఆరంభ శూరత్వమే అన్నట్లుగా మారింది.
- డంపింగ్ యార్డుల్లో వ్యర్థాలను ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్‌గా విడగొట్టాలి. కానీ ఈ ప్రక్రియ శాస్త్రీయంగా సాగడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
 
‘స్వచ్ఛ హైదరాబాద్’... విశ్వనగరం వైపు అడుగులేస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం శనివారం నుంచి చేపడుతున్న మహోద్యమం. కానీ గాలి, నీరు, పర్యావరణ కాలుష్యం నుంచి నగరానికి విముక్తి కల్పించని పక్షంలో నగర జీవనం దుర్భరంగా మారడం తథ్యమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్, ఈ-వేస్ట్, ఆస్పత్రుల వ్యర్థాలు, కాలం చెల్లిన వాహనాలు వెదజల్లే కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం బారి నుంచి మహా నగరానికి విముక్తి కల్పించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని సూచిస్తున్నారు. కాలుష్య నిరోధానికి... నగరాన్ని హరితవనంగా మార్చేందుకు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలని చెబుతున్నారు. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి.. కోటి జనాభాకు చేరువవుతున్న మహా నగర జీవనాన్ని దుర్భరంగా మారుస్తున్న కాలుష్య రక్కసిని పారదోలేందుకు నడుం బిగించకపోతే ఈ మహోద్యమం ఆశించిన      లక్ష్యాలను సాధించలేదని స్పష్టం చేస్తున్నారు.     - సాక్షి, సిటీబ్యూరో
 

బయోమెడికల్ వేస్ట్...
- నగరంలో ఐదువేల ఆస్పత్రులు ఉన్నాయి. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 400 గ్రాముల   జీవ వ్యర్థాలు వెలువడుతున్నట్లు

పీసీబీ లెక్క.
- గ్రేటర్‌లో నిత్యం 35 టన్నులు, శివారు  నుంచి 15 టన్నుల ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా.
- అనేక ఆస్పత్రులు సాధారణ చెత్తతో పాటే వీటిని పడేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు గాలిలో కలిసి వివిధ వ్యాధులకు

కారణమవుతున్నాయి.
- ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం-1998 ప్రకారం  రోజువారీ వెలువడే చెత్తను వేర్వేరు డబ్బాల్లో నింపాలి.
- 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి.
 
ఈ-వేస్ట్...

మహా నగరంలో ఏటా సుమారు 25 వేల టన్నుల ఈ-వేస్ట్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఇందులో సుమారు 55 శాతం వరకు పర్యావరణానికి హాని కలిగించే రీతిలో సాధారణ చెత్తతో పాటే పడేస్తున్నారు. ఈ-వ్యర్థాలు పర్యావరణంలో కలిసి అన ర్థాలకు కారణ మవుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లకు సంబంధించి ఏడాదికి 12 వేల టన్నుల వ్యర్ధాలు విడుదలవున్నట్లు తేలింది. ఇక టెలిఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల వంటి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యర్థాలను కలుపుకుంటే ఏడాదికి సుమారు 13 వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా. రాబోయే ఐదేళ్లలో ఈ-వ్యర్థాలు లక్ష టన్నులకు చేరుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
 
హరితహార మే పరిష్కారం...
- హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఇందులో కేవలం 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఉందని జీహెచ్‌ఎంసీ లెక్కలు చెబుతున్నాయి.
- మొత్తం నగర విస్తీర్ణంలో సుమారు 8 శాతమే హరిత వాతావరణం ఉంది.
- బెంగళూరు మహానగరంలో 13 శాతం (97 చదరపు కిలోమీటర్ల) మేర గ్రీన్‌బెల్ట్ ఉంది. దేశంలో ప్రణాళికా నగరంగా పేరొందిన చండీగఢ్ విస్తీర్ణం 114 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో 30 శాతం భూమిలో హరితతోరణం విస్తరించి ఉండడం విశేషం.
- దేశ రాజధాని ఢిల్లీలో 5.95 శాతం(88.4 చదరపు కిలోమీటర్లు), చెన్నైలో 2.01 శాతం (24 చదరపు కిలోమీటర్లు), ముంబయిలో 5.11 శాతం (86 చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో హరితతోరణం ఉంది.
- హరితహారం కార్యక్రమం చేపట్టి నగరంలో గ్రీన్‌టాప్ పెంచాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది.
 
ప్రస్తుతం నగరమంతా వినిపిస్తున్న మాట ‘స్వచ్ఛ హైదరాబాద్’. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, అధికారుల పర్యవేక్షణలో ప్రతినిత్యం వెలువడే చెత్తను తరలించేందుకు అదనపు వాహనాలు సిద్ధం చేశారు. వివరాలివీ...
 

చెత్త తరలింపు పనులకు వాహనాలు..
- 6 టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు     537
- 25 టన్నుల వాహనాలు                          76
- జేసీబీలు                                             34
 డంపర్ ప్లేసర్లు                                        35
 
 కాలం చెల్లిన వాహనాలతో...

- గ్రేటర్‌లో ప్రస్తుతం అన్ని రకాల వాహనాలు 43 లక్షలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కార్లు, జీపులు, ఆటోలు, బస్సులు ఇతర వాహనాల సంఖ్య సుమారు పది లక్షలు.  
- వీటి నుంచి వెలువడుతున్న పొగ నగర పర్యావరణాన్ని దెబ్బ తీస్తోంది. వీటి పొగ ద్వారా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, లెడ్, బెంజీన్ వంటి కాలుష్య కారకాలు నగర వాసులను శ్వాసకోశ వ్యాధులు, బ్రాంకైటిస్‌కు గురి చేస్తున్నాయి.
- ఈ పరిస్థితిని దూరం చేయాలంటే యూరో-4 ప్రమాణాలున్న వాహనాలను మాత్రమే నగర రహదారులపై రాకపోకలు సాగించేలా చూడాలి.
 
రెండు చెట్లతో నలుగురికి ఆక్సిజన్
- సాధారణంగా ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు అవసరమయ్యేఆక్సిజన్‌ను రెండు చెట్లు అందిస్తాయి.
- రెండు వేల జనాభా ఉన్న కాలనీలో 500 చెట్లు ఉండాలి.  
- ఒక చెట్టు జీవిత కాలంలో ఒక టన్ను కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది.
- 100 అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన చెట్టు 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.  
- సాధారణ స్థితిలో క్యూబిక్ మీటరు గాలిలో కార్బన్‌డయాక్సైడ్  320 పీపీఎంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే ఎలాంటి హానికర సంకేతాలు మనిషిని తాకవు. కానీ నగర వాతావరణంలో 390పీపీఎం వరకు పెరిగి పర్యావరణాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తోంది.
 
పరిశ్రమల కాలుష్యం

- నగర శివార్లలోని జీడిమెట్ల, పాశమైలారం, రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లోని కొన్ని బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు వదులుతున్న జల, వాయు కాలుష్యంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది.  
- నిబంధనల ప్రకారం జీరో లిక్విడ్ డిస్‌ఛార్జి (జల,వాయు,ఘన కాలుష్య ఉద్గారాలు పరిమితులకు లోబడి) ఉండే విధంగా ఉపకరణాలను ఏర్పాటు చేసుకున్న తరవాత ఉత్పత్తి సామర్థ్యం, విస్తరణ చర్యలు చేపట్టుకోవచ్చు. ఈ నిబంధన కాగితాలకే పరిమితమైంది.  
 
ఐదు రోజులు ఊడ్చేస్తే స్వచ్ఛ హైదరాబాద్ కాదు
నగర పర్యావరణాన్ని హననం చేస్తున్న ఘన వ్యర్థాలు, గాలి, నీరు కాలుష్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటేనే స్వచ్ఛ హైదరాబాద్‌కు సార్థకత. ఐదు రోజులు పరిసరాలను ఊడ్చేసి ఇదే ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటే వృథా ప్రయాసే. ఈ విషయంలో ప్రభుత్వం నిపుణులతో పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి.
 - ప్రొఫెసర్ జీవానందరెడ్డి,
కన్వీనర్, ఫోరం ఫర్ సస్టైనబుల్ ఎన్విరాన్‌మెంట్

పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలి
పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు పరిశుభ్రత పాఠాలు నేర్పించాలి. నగరంలోని రహదారులపై చెత్త పడవేసే వారిపై రూ.5, మూత్రం పోసిన వారిపై రూ.20 జరిమానా విధించి పక్కాగా వసూలు చేయాలి. మహిళలు పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నా..పురుషుల్లో ఈ స్పృహ తక్కువైంది. మున్సిపల్ కార్మికుల చీపుళ్లు, వాహనాలు ఆధునికీకరించాలి.
 - ప్రొఫెసర్ కంచ ఐలయ్య,
ఉస్మానియా విశ్వవిద్యాలయం, రాజనీతి శాస్త్ర విభాగం
 
పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలి
పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు పరిశుభ్రత పాఠాలు నేర్పించాలి. నగరంలోని రహదారులపై చెత్త పడవేసే వారిపై రూ.5, మూత్రం పోసిన వారిపై రూ.20 జరిమానా విధించి పక్కాగా వసూలు చేయాలి. మహిళలు పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నా..పురుషుల్లో ఈ స్పృహ తక్కువైంది. మున్సిపల్ కార్మికుల చీపుళ్లు, వాహనాలు ఆధునికీకరించాలి.
 - ప్రొఫెసర్ కంచ ఐలయ్య,
 ఉస్మానియా విశ్వవిద్యాలయం, రాజనీతి శాస్త్ర విభాగం

Advertisement
Advertisement