పోలవరం చట్ట విరుద్ధం | Sakshi
Sakshi News home page

పోలవరం చట్ట విరుద్ధం

Published Sun, Aug 10 2014 12:26 AM

పోలవరం చట్ట విరుద్ధం - Sakshi

  •     గిరిజన ప్రపంచం గుండెపై పోలవరం
  •      ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు
  • సుందరయ్య విజ్ఞాన కేంద్రం:  ఆదివాసీలను నీట ముంచుతున్న పోలవరం ప్రాజెక్టు చట్ట విరుద్ధమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ ఆదివాసీల హక్కులను పట్టించుకోవటం లేదని, అడవులపై వారికి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శిం చారు. సభలో ప్రొఫెసర్ భంగ్య భూక్యా, డాక్టర్ వీఎన్‌వీకే శాస్త్రి, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంనాయక్ పాల్గొన్నారు.  
     
    పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలి
     
    హిమాయత్‌నగర్ :  ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గిరిజనులు కనుమరుగయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. శనివారం హిమాయత్‌నగర్ చంద్రం బిల్డింగ్‌లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టీఆర్సీ) ఆధ్వర్యంలో  ‘పోలవరం ప్రాజెక్టు-ఆదివాసుల హక్కులు-చట్టాలు’ అన్న అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో జయధీర్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు గిరిజనుల గుండెపై కుంపటి లాంటిదన్నారు. తమ భాషకు లిపి కావాలని ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అసలు జాతులనే నాశనం చేయనున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేయాల్సిన అవసరముందన్నారు.

    కార్యక్రమంలో చెంచులోకం ప్రతినిధి తోకల గురవయ్య, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అప్కా నాగేశ్వరరావు, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, పీపుల్స్‌అగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు సోడె మురళి, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఓయూ) అధ్యక్షులు తొడసం పుల్లారావు, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (కేయూ) అధ్యక్షులు వాసం ఆనంద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పోచన్న ఆధ్వర్యంలో పలువురు గిరిజన కళాకారులు కళారూపాలు ప్రదర్శించారు.
     
    ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనుల భారీ ర్యాలీ

    ముషీరాబాద్/సుందరయ్యవిజ్ఞాన కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చట్టానికి, రాజ్యాంగానికి, గిరిజనుల ప్రయోజనాలకు విరుద్ధమైనదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం పేర్కొన్నారు. శనివారం పీపుల్స్ ఎగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సుందరయ్యవిజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ, అనంతరం ఇందిరాపార్కులో బహిరంగ సభ నిర్వహించారు.

    ఈ సభలో విరసం నాయకులు వరవరరావు, న్యూడెమోక్రసీ కె.గోవర్దన్, జార్ఖండ్ ఆదివాసి నాయకులు జితేన్ మరాండి, సోదెం మురళితో కలిసి ఆయన సభలో పాల్గొని ప్రసంగించారు. దాదాపు మూడు లక్షల మంది అమాయక గిరిజనుల పొట్టకొట్టే, నిలువునా ముంచేసే  పోలవరం ప్రాజెక్టు అనవరమైనదని చెప్పారు.

    ఆ ప్రాంత గిరిజనుల ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా బలవంతంగా నిర్మిస్తామని ముందుకు రావడం మోడీ ప్రభుత్వ నిరంకుశ, పాసిస్ట్ చర్యగా ఆయన అభివర్ణించారు. గిరిజనులు తమ మనుగడ కోసం విల్లంబులతో యుద్ధానికి దిగితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఇంకా ఈ సభలో శాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, రిటైర్డ్ ఇంజినీర్ భీమయ్య, ఆదివాసి మహిళా సంఘం అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
     
    ప్రాజెక్టును నిలిపివేయాలి

    ఆదివాసీలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పీపుల్ అగెనెస్ట్ పోలవరం ప్రాజెక్టు(పీఏపీపీ) ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే  నిలిపివేయాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి, ప్రజా కళామండలి కళాకారులచే నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
         
    ఆదివాసీలు తమ సంస్కృతిని చాటి చెప్పే విధంగా అలంకరించుకొని  చేసిన నృత్యాలు ఆకర్షించాయి. తమ చేతిలో విల్లులను పట్టుకొని చేసిన ప్రదర్శన, దింస నృత్యం ఆక ట్టుకుంది. ఈ ర్యాలీలో పీఏపీపీ జాతీయ నాయకులు జంజర్ల రమేష్ బాబు, జాతీయ కార్యదర్శి సున్నం వెంకటరమణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దెలేటి, నలమాస కృష్ణ, విరసం నేత వరవరరావు, సోడె మురళి, టీఎన్‌జీఓ అధ్యక్షులు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
     

Advertisement
Advertisement