రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం | Sakshi
Sakshi News home page

రాబోయే మూడు నెలలు అత్యంత కీలకం

Published Tue, Dec 9 2014 4:12 AM

The most crucial in the next three months

 నల్లగొండ అర్బన్ :విద్యుత్‌శాఖకు రాబోయే మూడు నెలల కాలం అత్యంత కీలకమైందని తెలంగాణ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ జె. రఘుమారెడ్డి అన్నారు. స్థానిక హైదరాబాద్ రోడ్డులోని విద్యుత్‌శాఖ అతిథిగృహంలో సోమవారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఈలు స్థానికంగా ఉండి కరెంట్ సరఫరాలో అవాంతరాలు, ఇతర సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రైతులకు పరిస్థితిని వివరించి అవగాహన కల్పించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ప్రస్తుతం పంట చేతికందుతున్నందున పాత బకాయిలను వసూలు చేయాలన్నారు. వాహనాలకు మైకులు బిగించి గ్రామాల్లో విద్యుత్ బకాయిలపై ప్రచారం చేయాలన్నారు. వచ్చేది వేసవి కాబట్టి కరెంట్ సమస్యలుంటాయి, పెండింగ్ బిల్లుల వసూళ్లకు ఇబ్బంది అవుతుందన్నారు. అందువల్ల బిల్లుల వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
 
 తక్కువ కలెక్షన్ చేసిన అధికారులను మందలించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో రావాల్సిన బిల్లులను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టళ్లు, నీటి సరఫరా పథకాలు మినహాయించి ఇతర అన్ని శాఖలకు బకాయిలపై నోటీసులిచ్చి వారం రోజుల అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యంపై నిఘా పెంచాలని, కేసులు నమోదు చేయాలన్నారు. కొక్యాలు  (కొండ్లు) తగించి 24 గంటలు విద్యుత్ వృథా చేస్తున్న వారికి పరిస్థితులను వివరించి డీడీలు తీసుకోవాలన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్, వివిధ పథకాలను సమీక్షించారు. మండలాల వారీగా విద్యుత్‌శాఖ పనితీరును అడిగి తెలుసుకున్నారు.
 
 నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ పట్టణాల్లో ఆర్‌ఏపీఆర్‌డీఆర్‌పీ పథకం ద్వారా చేపడుతున్న ఆధునిక విద్యుదీకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదన్నారు. గత నెలలో ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అధికారి ఉదంతాన్ని గుర్తు చేశారు. సమీక్ష సమావేశం జరుగుతుండగానే ధర్మారెడ్డి కాల్వ పరిధిలోని వలిగొండ, రామన్నపేట ప్రాంతాలకు చెందిన రైతులు రెండు లారీల్లో తరలివచ్చారు. కాల్వ వెంట మోటార్లు పెట్టడం వల్ల దిగువకు నీరందించడం లేదని సాగునీరే కాకుండా, తాగునీటికి ఇబ్బంది ఎదురవుతోందని వారు సీఎండీకి ఫిర్యాదు చేశారు. అక్రమ విద్యుత్ వాడకాన్ని నియంత్రిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంస్థ డెరైక్టర్ శ్రీనివాస్‌రావు, సీజెఎం పాండ్యా, శ్రీనివాస్‌రెడ్డి, నాగేంద్ర, ఎస్‌ఈ బాలస్వామి, విజిలెన్స్ సీఐ సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement