ఆ ముష్కరుల అడ్డా హైదరాబాదే! | Sakshi
Sakshi News home page

ఆ ముష్కరుల అడ్డా హైదరాబాదే!

Published Mon, Apr 6 2015 2:07 AM

ఆ ముష్కరుల అడ్డా హైదరాబాదే! - Sakshi

  • చాదర్‌ఘాట్ పరిసరాల్లోనే నివాసం?
  •  సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులు.. మదర్సాలపైనా దృష్టి
  •  హతమైన ఉగ్రవాదుల కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు
  • సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా జానకీపురం గ్రామ శివార్లలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ‘సిమి’ ఉగ్రవాదులు అస్లాం, ఇజాజ్‌లు హైదరాబాద్‌నే అడ్డా చేసుకున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు ధ్రువీకరించాయి. వీరు హైదరాబాద్‌లోనే మకాం ఏర్పరుచుకొని విజయవాడలో దోపిడీలకు పథకం వేసినట్లు భావిస్తున్న పోలీసులు హైదరాబాద్‌లో ఎక్కడ మకాం వేశారనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. చాదర్‌ఘాట్‌లో వారు బస్సు ఎక్కే సమయంలో ఆ ప్రాంతానికి ఎలా, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలను కనుక్కునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

    గత అనుభవాల నేపథ్యంలో కొన్ని మదర్సాలపైనా దృష్టి సారించారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సిమి మాజీ అధ్యక్షుడు మహ్మద్ సలావుద్దీన్ మలక్‌పేటలో ఫర్నిచర్ షాప్ నిర్వహించేవాడు. సిమి ఉగ్రవాదులు సైతం చాదర్‌ఘాట్‌లో బస్సు ఎక్కడం, సలావుద్దీన్ నివాసం కూడా చాదర్‌ఘాట్‌కు ఆనుకునే ఉండటంతో ఈ ప్రాంతంపై పోలీసులు మరింత దృష్టి సారించారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి 2013 అక్టోబర్ 1న పారిపోయిన ఏడుగురు ఉగ్రవాదుల్లో అస్లాం, ఇజాజ్‌లు జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా ఫైజల్, అబీద్‌లు గతేడాదే పోలీసులకు చిక్కారు.

    ఇక మిగిలిన మహబూబ్, అంజద్, జకీర్‌లు నేటికీ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా హైదరాబాద్‌లోనే మకాం వేశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురిలో ఒకరు జానకీపురం ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతని కోసం వరంగల్, నల్లగొండ జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
     
    ‘సిమి’కి కేంద్రంగా నల్లగొండ...


    ఉమ్మడి రాష్ట్రంలో సిమి బలపడటం వెనక నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు ఈ సంస్థలో కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన సయ్యద్ సలావుద్దీన్ 1998లో ‘సిమి’ అఖిల భారత అధ్యక్షుడి స్థాయికి ఎదిగాకే ఈ సంస్థ తీవ్రవాద కార్యకలాపాలను ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో సిమి కార్యకలాపాల నిర్వహణకు నల్లగొండ జిల్లాను మూడో కేంద్రంగా నడిపించారు. గుజరాత్ మాజీ హోం మంత్రి హరీన్ పాండ్య హత్య కేసులో పాల్గొన్న అస్గర్ అలీ కూడా ఇదే జిల్లాకు చెందిన వ్యక్తే. కాగా, హైదరాబాద్‌లో గతంలో టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని పేల్చేసిన ‘హుజి’ ఉగ్రవాది అబ్దుల్ ఖాజా కూడా నల్లగొండ జిల్లాకు చెందినవాడే.
     
    కీలకం కానున్న కాల్‌డేటా...


    జానకీపురం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల నుంచి రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇందులో కీలక సమాచారాన్ని రాబట్టారు. సెల్‌ఫోన్లలోని ఔట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్‌పై ఇప్పటికే ఆరా తీయడంతోపాటు ఫోన్లలో ముష్కరులు ఫీడ్ చేసుకున్న కొన్ని సెల్ నంబర్ల ఆధారంగా వారి చిరునామాలను గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ బృందాలు పనిచేస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement