ఆశలు కుప్పకూలి! | Sakshi
Sakshi News home page

ఆశలు కుప్పకూలి!

Published Wed, Aug 9 2017 1:31 AM

ఆశలు కుప్పకూలి! - Sakshi

గత్యంతరం లేక కూలీలుగా మారుతున్న యువతరం
► చదువు మానేసి కొందరు.. చదివే స్తోమత లేక ఇంకొందరు..
► రాష్ట్రంలో పెద్దసంఖ్యలో పెరుగుతున్న నవతరం కూలీలు
► సాగు సంక్షోభం, సామాజిక అంతరాలు, నైపుణ్య లేమి కారణం


సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో కూలీల సంఖ్య పెరిగిపోతోంది. అందులోనూ చదువు మధ్యలో మానేసినవారే అధికంగా ఉంటున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటంతో సాగును వదిలేసి కూలీలుగా మారుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న సామాజిక అంతరాలు, వృత్తి నైపుణ్యాల కొరత వల్ల కూడా యువత కూలిబాట పట్టక తప్పడం లేదని సామాజిక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా పాత ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో వ్యవసాయ కూలీల సంఖ్యలో పెరుగుదల ఎక్కువగా ఉంది. 2001లో రాష్ట్రంలో 1.40 కోట్ల మంది కూలీలుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.64 కోట్లకు చేరింది.

2001లో 82 లక్షలున్న వ్యవసాయ కూలీల సంఖ్య ఇప్పుడు 92 లక్షలు దాటింది. 15 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న యువతీ యువకులే కూలీలుగా మారుతుండటం ఆందోళనకర పరిణామమని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మానవాభివృద్ధి సూచీలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ వ్యవసాయం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో సాగు గిట్టుబాటుగా లేకపోవటంతోపాటు 90% మంది రైతులు అప్పుల్లో ఉన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న భూముల్లో 65.5% భూమి కౌలు రైతుల చేతుల్లో ఉంది. రైతులు సైతం పెట్టుబడులు, అప్పుల భారం భరించలేక తమ భూములను కౌలుకు ఇచ్చేస్తున్నారు. దీంతో కౌలు భూమి విస్తీర్ణం పెరిగి పోతోందని వ్యవసాయశాఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

బడిబాట కాదు.. కూలిబాట
సాగు గిట్టుబాటు కాకపోవటం, విత్తనాలు, పెట్టుబడులు కూలీ ఖర్చులు భరించలేక చాలామంది రైతులు తమ పిల్లల్ని.. పనిలో చేదోడువాదోడుగా ఉంటారన్న ఉద్దేశంతో పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో రైతు కుటుంబాల్లో మధ్యలోనే చదువులు మానేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది

. రాష్ట్రంలో దాదాపు 29 శాతం మంది రైతు బిడ్డలు ఇలాగే కూలీల అవతారమెత్తినట్లు ఇటీవల ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనంలో తేలింది. అత్యధికంగా ఎస్సీల్లో 38 శాతం మంది, ఎస్టీల్లో 24 శాతం మంది, ఇతర కులాలకు చెందిన వారిలో 30 శాతం మంది కూలీలుగా మారినట్లు అంచనాలున్నాయి. వీరంతా వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలుగా పని చేస్తున్నారు. దాదాపు 90 శాతం మందికి నైపుణ్యం లేకపోవటంతో కాయకష్టం నమ్ముకునే బతుకులీడిస్తున్నారు. కనీస వేతనాలు సైతం అందుకోలేకపోతున్నారు.

 
ప్రస్తుతం రాష్ట్రంలో కూలీలు (కోట్లలో) 1.64
2001లో 1.40 కోట్లకు పైగా
ప్రస్తుతం వ్యవసాయకూలీలు (లక్షల్లో)  92
2001లో   82 లక్షలకు పైగా

చదువుకునే స్తోమత లేక..
చదువుకోవాలనే ఆరాటమున్నా.. ఆర్థిక స్తోమత లేక కూలీలుగా మారుతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. వారసత్వంగా నమ్ముకున్న వ్యవసాయం, కుటుంబ వృత్తులు చేసుకోలేక ఉద్యోగాలకు చేరువ కాలేక నలిగిపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఇలాంటి యువత సంఖ్య 15% , ఇతర కులాల్లో 11% మేర ఉన్నట్లు ఇటీవల ప్రణాళిక విభాగం చేయించిన మానవాభివృద్ధి ర్యాంకుల అధ్యయనంలో వెల్లడైంది. వారసత్వంగా వచ్చిన సాగు, వృత్తులకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగావకాశాలు లక్ష్యంగా చదువుకునే వారున్నా.. మిగతా కేటగిరీలతో పోలిస్తే వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement