పేరుకే పార్ట్‌టైం.. పని ఫుల్‌టైమ్ | Sakshi
Sakshi News home page

పేరుకే పార్ట్‌టైం.. పని ఫుల్‌టైమ్

Published Tue, Sep 9 2014 2:43 AM

the situation of contract teachers

కరీంనగర్‌ఎడ్యుకేషన్: పేరుకే వారు పార్ట్‌టైమ్ ఉద్యోగులు. కానీ చేసే పని ఫుల్‌టైమ్ ఉద్యోగులకు తక్కువేం కాదు. పాఠాలు చెప్పాలి.. పాఠశాల రికార్డులు చూడాలి.. ప్రధానోపాధ్యాయులు చెప్పే మరేపనైనా చేసి తీరాలి.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర ఆసక్తికర అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. వారికిచ్చే గౌరవ వేతనం రూ. 6 వేలే. కానీ పాఠశాలల్లో వారితో చేయించని పని అంటూ లేదు.
 
వాస్తవంగా వీరి విధులివీ..
జిల్లాలోని పాఠశాలల్లో వర్క్, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా 600 ఖాళీలు ఉన్నాయని సర్వాశిక్షాఅభియాన్ అధికారులు నివేదిక పంపారు. కానీ జిల్లాలో పనిచేసే వారు 243  మంది పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు మాత్రమే. ఇంకా 357 పోస్టులకు నియామకాలు చేపట్టాల్సి ఉండగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. నోటిఫికేషన్ జారీ చేసి నియామకపు ప్రక్రియను నిలిపివేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు ఖాళీ ఉంచొద్దు. వీరు నెలకు 20 పీరియడ్లు మాత్రమే బోధించాలి. కానీ హెచ్‌ఎంలు దీన్ని విస్మరిస్తున్నారు.
 
పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వంద మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనే వీరిని నియమించారు. జిల్లాలో ఆర్ట్ ఎడ్యుకేషన్ కోసం 106 మందిని, ఫిజికల్, హెల్త్ ఇన్‌స్ట్రక్టర్లుగా 15 మందిని, వర్క్‌ఎడ్యుకేషన్ కోసం 122 మందిని తీసుకున్నారు. వీరంతా ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌ఎం, పాఠశాల విద్యాకమిటీ ఆధ్వర్యంలో వీరి పనితనాన్ని ధ్రువీకరించాకే సర్వశిక్షాఅభియాన్ ద్వారా వేతనాలు చెల్లించాలని నిబంధన ఉంది. ఫలితంగా ఇన్‌స్ట్రక్టర్లకు చాకిరీ తప్పడం లేదు.
 
జీతాలు రావేమో అని చెప్పిన పనల్లా చేస్తున్నం..
చాలా పాఠశాలల్లో  పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు తమకు నిర్దేశించిన విధులు నిర్వర్తించడం లేదు. వీరితో హెచ్‌ఎంలు ఇతర సబ్జెక్టులకు పాఠాలు చెప్పిస్తున్నారు. పలు పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకూ తమతో పాఠాలు చెప్పిస్తున్నారని పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు అవేదన వ్యక్తంచేస్తున్నారు. పలు గ్రామీణ పాఠశాలల్లో రికార్డులు నిర్వహింపజేస్తున్నారు. జీతాలు రావేమోననే భయంతోనే హెచ్‌ఎంలు చెప్పిన పనల్లా చేస్తున్నామని ఇన్‌స్ట్రక్టర్లు పేర్కొంటున్నారు. వీరి సేవలను సరైన తీరుగా వినియోగించుకుని మంచి ఫలితాలు సాధిస్తేనే విద్యార్థులకూ మేలు.

Advertisement
Advertisement