మంచు ముల్లె! | Sakshi
Sakshi News home page

మంచు ముల్లె!

Published Thu, Dec 18 2014 1:58 AM

మంచు ముల్లె! - Sakshi

పల్లె మంచు ముల్లైంది.. పట్టణం వణుకుతోంది.. ఆకులపై మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నారుు.. ముట్టుకుంటే చలిగింతలు పెడుతున్నారుు.. పట్టణాల్లో ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగడం లేదు.. ఏజెన్సీలో సూరీడి ఆచూకీ పదైన కానరావడం లేదు.. ఆ తర్వాత మంచుతెరలను చీల్చుకుంటూ.. నేనొస్తున్నానంటూ ఎరుపెక్కుతున్నాడు.. రాత్రి ఏడు గంటలకే తండాలు ముసుగేస్తున్నారుు.. పట్టణ రహదారులపై జనం పలుచబడుతున్నారు..
 
జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారి పెరిగింది. రెండు రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. బుధవారం ఈ ఏడాదిలోనే కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ మించడం లేదు.  రెండు రోజులుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తున్నాయి. ఈ సీజన్‌లో నవంబర్‌లో చలి తీవ్రత 14 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. డిసెంబర్ మధ్య నుంచి ఒక్కసారిగా తీవ్రత పెరిగింది. డిసెంబర్ 1 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతున్నా.. పగటి వేళ సగటు ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో చలి తీవ్రత పెద్దగా లేదు. అయితే రెండు రోజులుగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మొదలైంది. ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్ 1 నుంచి రాత్రి వేళలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 సెల్సియస్ డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. పగటి వేళ గరిష్టంగా ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది.

ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో అస్తమా రోగులు, చంటిపిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. చలిబారి నుంచి రక్షణ చర్యలు తీసుకోకుంటే పిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. చలి నుంచి తట్టుకోవడానికి స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు వాడుతున్నారు. ఏజెన్సీలో చలిమంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నేపాలి వ్యాపారులకు గిరాకీ పెరిగింది. మరో నాలుగు రోజులపాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement