ఎట్లున్నరో.. ఏమో! | Sakshi
Sakshi News home page

ఎట్లున్నరో.. ఏమో!

Published Sat, Dec 5 2015 1:28 AM

Their concern over the situation in Chennai

చెన్నైలో తమ వారి పరిస్థితిపై ఆందోళన
 
చెన్నైలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, చెరువులు ఏకమై.. ఆహారం, నిద్ర లేక అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు పత్రికలు, టీవీల్లో కథనాలు వస్తు న్నాయి. అయితే, ఉద్యోగం, వ్యాపార రీత్యా చెన్నైలో ఉంటున్న వరంగల్ జిల్లా వాసులకు సంబంధించి సమాచారం లేకపోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతు న్నారు. తమ వారికేం అయిందో, ఎలా ఉన్నారో తెలియక.. ఫోన్లు కలవక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బంధువుల యోగక్షేమాల కోసం ఆరా తీస్తూ గడుపుతున్నారు.
 
చెన్నైలో 50 కుటుంబాలు
కొడకండ్ల : మండలకేంద్రానికి చెందిన 50 కుటుంబా లు చెన్నై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జీవిస్తున్నారు. కోరకుపేట, తండ్వారుపేట, వేసార్‌పాడి, మెచ్చేరి, తుంగతుర్తి, అమ్మనబోలు, ఈటూరు తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. తమ వారు ఉండే ప్రాంతంలో రెండు అంతస్తుల వరకు నీరు రాగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పైఅంతస్తుల్లో ఉంటున్నట్లు చెబుతున్నారని స్థానికులు సింగరం కొమురయ్య, గోధుమల బయ్యన్న, సింగరం రుద్రయ్య, కొప్పు అంజయ్య, గోధుమల రవి తెలిపారు. ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయని, సమయూనికి తిండి లేక దుర్భర జీవితాలు గడుపుతున్నారని తెలిసిందని చెప్పారు. తాము ఫోన్ చేస్తే కలవడంలేదని, వారు ఎప్పుడోసారి చేస్తున్నారని, బయటకు వెళ్లాలంటే నీటిలో ఈదుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉందంటున్నారని పేర్కొన్నారు. ఇంకా తమవారు సురక్షితంగా ఉన్నా సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు నేతి శ్రీను, మునిందర్, సమ్మయ్య, రాజశేఖర్, యాదయ్య తెలిపారు. చెన్నైలోని యాసంపేట, కడింగూర్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఇంట్లో సరుకులు అందడంలేదని, బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటున్నారని తెలిపారు. కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
 
ఉదయ్ క్షేమం
 కేసముద్రం : చెన్నైలో వరద ప్రవాహంలో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న కేసముద్రం మండలంలోని అమీనాపురం గ్రా మానికి చెందిన ముత్యాల ఉదయ్ క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు ఆయన శుక్రవారం తల్లి రమాదేవికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. అమీనాపురం గ్రామానికి చెందిన ముత్యాల రమాదేవి కుమారుడు ఉదయ్ బీఫార్మసీ పూర్తి చేసి చెన్నైలోని తారామణి ఏరియా ఏజీఎస్ హెల్త్‌కేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మణిపాక సిటీ వేలాచేరిలో గల భవనం కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న విషయం తెలిసిందే. అరుుతే చెన్నైలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉదయ్ అద్దెకు ఉంటున్న ఇల్లు నీట మునిగింది. దీంతో ఉదయ్ తోటివారితో కలిసి భవనంపైకి ఎక్కాడు. కాగా, వరదనీరు పెద్దఎత్తున ప్రవహిస్తుండడంతో అద్దెగదిలోని సామగ్రి అంతా కొట్టుకుపోయింది. అలాగే ఉదయ్ రెండు సెల్‌ఫోన్లలో ఒకటి నీటిలో కొట్టుకుపోగా మరోదానితో బుధవారం తల్లి రమాదేవికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత చార్జింగ్ లేకపోయింది. తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. దీంతో గురువారం నుంచి ఆమె ఆందోళనకు గురవుతోంది. కాగా, గురువారం సాయంత్రం సహాయక బృందం పడవపై వచ్చి భవనంపై ఉన్న ఉదయ్‌తోపాటు మరికొందరిని తారమణి ఏరియాలో ఉంటున్న ఆఫీస్ వైపునకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం అక్కడ ఉన్న జనరేటర్ ద్వారా సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకుని తల్లికి ఫోన్ చేసి మాట్లాడడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, వరద ప్రవాహం తగ్గిన తర్వాత ఇంటికి వస్తానని చెప్పడంతో తల్లితోపాటు బంధువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
 
వరదల్లో ఏటూరునాగారం వాసులు
ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని ఎస్‌ఏ.ఖాదర్ కిరాణ షాపు యజమాని సర్కార్ సోదరుడు అరుణ్ రషీద్, ఖాజాపాషా, ఆయన భార్య సుబూనిసా, ఇద్దరు పిల్లలు నిసారహ్మద్, యూసబీన్‌రోజా, దిల్షాద్, అలాగే ఖాజా కిరాణషాపు యజమాని ఖాజాపాషా ఆయన భార్య రమీసా, కుమారుడు ముజీబ్ చెన్నై వరదల్లో చిక్కుకున్నారు. చెన్నై వాసరాబాడిలోని భారతినగర్, తాంబరం పట్టణంలో వీరి కుటుంబాలు నివసిస్తున్నారుు. చెన్నైలో వచ్చిన వరదల్లో చిక్కుకోగా ఇక్కడి కుటుంబసభ్యులకు క్షేమ సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు. అలాగే సెల్‌టవర్లు కూలిపోగా వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లు మూడు రోజుల నుంచి కలవడం లేదని ముజీబ్ సోదరుడు ఖని తెలిపారు. వారు ఎలా ఉన్నారో అర్థం కాక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని ఖాజా సోదరుడు సర్కారు తెలిపారు.
 
తిండీ.. నిద్ర లేదు
రెండు నెలల క్రితమే చెన్నైకి వెళ్లాను. గిండి ప్రాంతం రామపురంలో ఉంటూ మందుల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. వారం రోజుల క్రితం జోరుగా వర్షాలు కురిశాయి. మళ్లీ మంగళవారం నుంచి వర్షం కురవడం ప్రా రంభమైంది. రాత్రికిరాత్రే మేము ఉండే అపార్ట్‌మెంట్ చుట్టూ వరదనీరు చేరింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోంది. వరదకారణంగా పవర్ కట్ అయ్యింది. వాటర్ లేదు. కిం దకు దిగుదామంటే నీళ్లు. మొబైల్‌లో చార్జింగ్ ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. ఇంటికి ఫోన్ చేసి నేను క్షేమంగా ఉన్నట్లు చెప్పాను. మేడ వరకు నీళ్లు వస్తుంటే ధైర్యం చేసి నడుచుకుంటూ వెళ్లి మెట్రో రైలు ఎక్కాను. అక్కడి నుంచి నెల్లూరు మీదుగా వరంగల్ వచ్చాను. పోయిందే కొత్తగా అంటే... వరదలు రావడంతో ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఇంటికి క్షేమంగా తిరిగి రావడంతో అందరూ సంతోష పడ్డారు.
 - మంత్రి రాజు, పరకాల  

అంత నీటిని ఎప్పుడూ చూడలేదు
మూడు సంవత్సరాల నుంచి చెన్నైలోని రామపురంలో ఉంటూ ఎల్‌అండ్‌టీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. ఒక్కటే వాన. మేము ఉండే ప్రాంతంలోకి వరద నీరు వచ్చింది. అడియార్ రివర్ దగ్గర ఉండడంతో వరద పెరిగింది. రెండు రోజుల తర్వాత వరద కొద్దిగా తగ్గడంతో నీళ్లలోంచి నడుచుకుంటూ రైల్వేస్టేషన్‌కు వచ్చాం. నెల్లూరు మీదుగా ఇక్కడకు చేరుకున్నాం. ఫుడ్ కోసం ఇబ్బంది పడ్డాం. సెకండ్ ఫ్లోర్‌లో ఉండడంతో మాకు వరద నీరు రాకపోయినా కరెంటు లేక చీకట్లోనే ఉన్నాం. అమ్మానాన్నకు ఫోన్ చేసి బాగానే ఉన్నట్లు చెప్పాను.
 - యెల్ది రాజేష్‌ఖన్నా, పరకాల  
 
టీవీ చూస్తూనే ఉన్నాం
చెన్నైలో వర్షాల కారణంగా వరదలు వచ్చాయని టీవీలు, పేపర్లల్లో చూసి ఒక్కసారి ఆందోళనకు గురైం. చెన్నైలో ఉన్న మా కొడుకు ఫోన్ చేస్తే కలవడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవకపోవడంతో టీవీ చూసుకుంటూనే ఉన్నాం. రెండు రోజులు అన్నమే తినలేదు. చెన్నై నుంచి మా కుమారుడు రావడంతో ఆనందంగా ఉంది.
 - యెల్ధి రాజేష్‌ఖన్నా త ండ్రి శివరాజం, పరకాల  
 
చీకట్లోనే ఉంటున్నరట
తమ్ముడి కుటుంబం చెన్నైలోని అరుణాచలం ట్యాంకు బండ్‌లో నివసిస్తోంది. మా నాన్న వారితోనే ఉంటూ నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తమ్ముడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్లుండే భవనం కింది అంతస్తు పూర్తిగా నీటితో మునిగిందని, మూడు రోజులుగా కరెంట్ లేక చీకట్లోనే ఉంటున్నామని ఫోన్ చేసి చెప్పారు. కరెంటు లేకపోవడంతో ఫోన్‌లు పనిచేయడంలేదు. నిత్యావసర సరుకులు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
 - ఎండీ.ఖాజా, పాలకుర్తి
 

Advertisement
Advertisement