క్రేన్ తో దొంగతనానికి వచ్చి.. | Sakshi
Sakshi News home page

క్రేన్ తో దొంగతనానికి వచ్చి..

Published Tue, Jun 23 2015 9:59 AM

క్రేన్ తో దొంగతనానికి వచ్చి..

తలకొండపల్లి: చోరీ ఘటన సినిమా సీన్‌ను తలపించింది.. క్రేన్ సహాయంతో ఓ భారీ వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అయితే క్రేన్ బురదలో కూరుకుపోవడంతో ప్రయత్నం బెడిసి విగ్రహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన సోమవారం మండలంలోని వెల్జాల్ గ్రామంలో సంచలనం రేకెత్తించింది. గ్రామశివారులోని వెంకాయకుంటలో ఆరుబయట అతిపురాతన వినాయక విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి అత్యంత పవిత్రత ఉందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢనమ్మకం. కోరినకోర్కెలుతీర్చే దేవుడిగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

అయితే ఇంతటి విశిష్టత కలిగిన వినాయకుడి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లేందుకు పథకం రచించారు. ఆదివారం అర్ధరాత్రి క్రేన్‌తో వెంకాయకుంటకు చేరుకున్నారు. విగ్రహాన్ని ట్రక్కు, లారీ, తదితర వాహనాల్లో వేయడానికి యత్నించారు. కొద్దిదూరం పాటు విగ్రహాన్ని క్రేన్‌సాయంతో కదిలిం చారు. లారీలో వేస్తుండగా క్రేన్ బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో దుండగులు విగ్రహంతో పాటు క్రేన్‌ను అక్కడే వదిలిపారిపోయారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కొందరు క్రేన్‌ను గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఆమనగల్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు మహేందర్, శ్రీనివాసులు, సాయికుమార్  అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు ఆరాతీరు.

గ్రామస్తుల ఆందోళన
క్రేన్‌ను అక్కడినుంచి తరలించేందుకు సన్నాహాలు చేశారు. గ్రామస్తులు క్రేన్‌ను ఎక్కడికీ తరలించొద్దని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యజమాని ఇక్కడికి రావాలని, విగ్రహం చోరీ వివరాలను వెల్లడించాలని పట్టుబట్టారు. పోలీస్‌లు ఎంతచెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు కొద్దిసేపు వా గ్వాదం కొనసాగింది. విషయం తెలుసుకున్న మాజీ ఏంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు  తహశీల్దార్ జ్యోతిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వినాయకుడి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టింపజేస్తామని ఇరువర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అక్కడే ఉన్న క్రేన్‌సాయంతో పూర్వస్థానంలో ఉంచారు. విగ్రహాన్ని అభిషేకించి ప్రత్యేకపూజలు జరిపారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. క్రేన్‌ను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement