సాగుకు నిధుల పొంగు! | Sakshi
Sakshi News home page

సాగుకు నిధుల పొంగు!

Published Thu, Mar 12 2015 4:24 AM

There cultivation of funds!

  • రూ. 11,733 కోట్లతో భారీగా కేటాయింపులు
  • సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రాష్ర్ట ప్రభుత్వం నిధుల వరద పారించింది. గత ఏడాది కంటే రూ. రెండు వేల కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి అగ్రతాంబూలం వేసింది. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులన్నింటికీ తొలి ప్రాధాన్యమివ్వడంతో పాటు ఇతర ప్రాజెక్టులకూనిధులిచ్చి ఊపిరి పోసింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాన్ని కలుపుకొని మొత్తంగా సాగునీటి రంగానికి బడ్జెట్‌లో రూ. 11,733.93 కోట్లను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కేటాయించారు.

    ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు రూ. 9,052 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ. 2,232 కోట్లు ప్రతిపాదించారు. దీనికింద గత ఏడాది మాదిరే మిషన్ కాకతీయకు రూ. 2,100 కోట్లను కేటాయించింది. వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టుల కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ మేరకే ప్రాజెక్టు పరిధిలో జరిగిన, జరుగుతున్న పనుల గీటురాయి లెక్కన నిధుల కేటాయింపు జరిపినట్టు అర్థమవుతోంది. ఇక టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొలి ఏడాదే రూ. 100 కోట్ల మేర నిధులు కేటాయించింది.

    మరో ప్రాజెక్టు జూరాల-పాకాలకు మాత్రం నామమాత్రంగానే నిధులిచ్చింది. ఏఎంఆర్‌పీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ నిర్మాణానికి గతంలో రూ. 325 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 600 కోట్లు కేటాయించారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మండలాల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించినప్పటికీ దానికి ప్రత్యేకంగా నిధులు మాత్రం కేటాయించలేదు.
     
    ‘పాలమూరు’కు పండగే!

    పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నిధులు దక్కాయి. మొత్తంగా 942.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 70 టీఎంసీల కృష్ణా జలాలు వినియోగంలోకి వస్తాయి. దీంతో వచ్చే ఖరీఫ్ నాటికే 3 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశముంటుంది. ఇప్పటికే భూసేకరణ, పునరావాస చర్యలు కొలిక్కి రావడంతో భారీ కేటాయింపులకు ప్రభుత్వం మొగ్గు చూపింది. సుమారు రూ. 16 వేల కోట్లతో చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి తొలి ఏడాది రూ. 100 కోట్లు కేటాయించింది. జూరాల-పాకాల వరద కాల్వకు మాత్రం కేవలం 3.60 కోట్లతో సరిపెట్టింది. అలాగే కరీంగనర్ జిల్లాలోని ఎల్లంపల్లికి రూ. 558 కోట్లు (గత బడ్జెట్‌లో రూ. 237 కోట్లు), ఎస్సారెస్పీ వరద కాల్వకు రూ. 747 కోట్లు (గతంలో రూ. 200 కోట్లు) ఇవ్వడం ఊహించని విషయం. ఆదిలాబాద్ జిల్లాలో పనులు చివరి దశలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులు సాత్నాల, సుద్దవాగు, గొల్లవాగు, జగన్నాథ్‌పూర్ పెద్దవాగు, రాలీ వాగు ప్రాజెక్టులకు గతంలో కంటే కేటాయింపులు పెరిగాయి. వీటికి సుమారు రూ. 80 కోట్ల మేర నిధులు దక్కాయి.
     
    ‘ప్రాణహిత’కు కోత

    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు బడ్జెట్‌లో భారీ కోత పడింది. గత ఏడాది భారీగా నిధులిచ్చిన సర్కారు.. ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా తగ్గించింది. గత బడ్జెట్‌లో రూ. 1820 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ. 1515 కోట్లకు పరిమితం చేసింది. కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాల్లో నిర్మించదలచిన తడ్కపల్లి, పాములపర్తి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 5 టీఎంసీల నుంచి 51 టీఎంసీలకు పెంచుతామని మాత్రం ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వెల్లడించారు. వీటికి రూ. వెయ్యి కోట్ల మేర అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయ అంచనా రూ. 38,500 కోట్లు కాగా, ఇప్పటికి రూ. 36,257 కోట్లకు ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటివరకు రూ. 8 వేల కోట్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిధులు అంతంతమాత్రంగానే ఇవ్వడంతో ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్నది చర్చనీయాంశమైంది.
     
     బడ్జెట్  కేటాయింపులు(రూ. కోట్లలో..)
     
     దేనికి ఎంత? (రూ. కోట్లలో..)
     భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు -9,052.17
     చిన్న నీటి పారుదల రంగం - 2,232.76
     క్యాడ్, వరద కాల్వల నిర్వహణ- 398.98
     
     కేటాయింపుల కన్నా ఖర్చే ముఖ్యం
     బడ్జెట్ కేటాయింపులు అనుకున్నట్టే ఉన్నాయి. పాలమూరు జిల్లాకు అంచనాలకు తగ్గట్లు కేటాయించారు. అయితే పనులు జరగడం ముఖ్యం. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే 7 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. నక్కలగండి ఎత్తిపోతలపై స్పష్టత లోపించింది. రూ. 6 వేల కోట్ల విలువైన పనులకు ప్రత్యేకంగా కేటాయింపులి ఆవ్వల్సింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకూ వెయ్యి కోట్లు కేటాయిస్తే బాగుండేది.
     - రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి
     

Advertisement
Advertisement