కృష్ణమ్మ చెంతన.. విద్యుత్ కాంతులు | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ చెంతన.. విద్యుత్ కాంతులు

Published Tue, Dec 23 2014 1:32 AM

thermal power plant 2 thousand MW

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రానున్న మూడేళ్లలో 2వేల మెగావాట్ల సామర్థ్యం కల విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని కృష్ణా నదిపరీవాహక ప్రాంతాలైన దామరచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువులలో అవసరమయ్యే భూములను పరిశీలించేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూములను ఎంపిక చేయనున్నారు. ఆయనతో పాటు జెన్‌కో అధికారులు, విద్యుత్ నిపుణులు వస్తుండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
 రవాణా, నీటి సదుపాయాలే కారణం..
 వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న నేపథ్యంలో వడివడిగా విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం ముందుకెళుతోంది. అందులో భాగంగా పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1700 మెగావాట్లు, 850 మెగావాట్ల ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది కూడా. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు కూడా చురుకుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ  ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం జిల్లాను ఎంచుకున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
 
 అయితే, థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు నీరు, బొగ్గుతో పాటు రవాణా సదుపాయం అవసరం. జిల్లాలో పవర్‌ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసినా బొగ్గు నిల్వలను మాత్రం దిగుమతి చేసుకోవాల్సిందే. అటు ఖమ్మం జిల్లాలోని సింగరేణి గనుల నుంచి లేదా విదేశాల నుంచి బొగ్గును తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎలా తెచ్చుకునే దానిని ప్లాంటు వరకు తీసుకెళ్లేలా రవాణా సదుపాయం ఉండాలి. అదే విధంగా నీరు చాలా అవసరం. సంవత్సరం పొడవునా నీటి కొరత లేని ప్రాంతాలను మాత్రమే ఇందుకు ఎంపిక చేసుకోవాలి. ఈ కోణంలో జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతాలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ అందుబాటులో ఉండడం, నీళ్లు అపారంగా ఉండడంతో అక్కడ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు తయారవుతున్నాయి.
 
 భూసేకరణే కీలకం..
 ముఖ్యంగా విద్యుత్‌ప్లాంటు ఏర్పాటుకు భూసేకరణ చాలా కీలకం కానుంది. జిల్లాలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మించాలంటే దాదాపు మూడువేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా. ప్రాజెక్టులో కీలకమైన టర్బైన్ల ఏర్పాటుకే 850 ఎకరాల వరకు అవసరం అవుతుంది. ఇందుకు తగిన భూమిని వెతుకులాడి, ప్రణాళికలు సిద్ధం చేసి, సవ్యంగా సేకరిస్తేనే ఈ ప్రాజెక్టు పురోగతి సాధించనుంది. ఇందుకోసం దామరచర్ల మండలంలో వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, ముదిమాణిక్యం,కొత్తపల్లి పరిసర గ్రామాల్లో సుమారు రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 3000 ఎకరాల ఫారెస్టు భూమి కలిగి ఉంది. మఠంపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెరువు మండలాల్లోని ప్రభుత్వ భూమి, ఫారెస్టు, డీఫారెస్టు, పోరంబోకు భూములు కలిపి 30వేల ఎకరాలకు పైగా ఉంది.
 
 అయితే, ఇక్కడ ఉన్న పరిశ్రమల చేతిలో చాలా భూములుండడం, ప్రభుత్వ పరిధిలో ఏ భూమి ఉంది, ఏ భూమిని పరిశ్రమలకు కేటాయించారన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఏదేమైనా మూడువేల ఎకరాల భూమి ఎక్కడ లభిస్తే అక్కడ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎక్కువగా దామరచర్లలోనే ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, ప్రత్యామ్నాయంగా మఠంపల్లి, మేళ్లచెరువు మండలాలను ఎంచుకుంటామని వారు చెబుతున్నారు. అయితే, భూసేకరణ జరిగి జెన్‌కోకు భూములను అప్పగిస్తే రెండేళ్లలో ప్లాంటు నిర్మాణం పూర్తవుతుందని విద్యుత్ నిపుణులు చెపుతున్నారు.
 
 విద్యుత్ లెక్క ఇదీ....
 విద్యుదుత్పత్తి, వినియోగం లెక్కలను ఒకసారి చూస్తే...500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తే 12 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ఈ లెక్కన 500 మెగావాట్ల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 4,380 మిలియన్ యూనిట్ల కరెంటు వస్తుంది. కాగా జిల్లాలో ఏర్పాటు కాబోతున్న 2,000 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్ల ద్వారా 17,520 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అయితే..యూనిట్ సామర్థ్యంలో 100 శాతం విద్యుత్ ఉత్పత్తి కాదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ( కేటీపీఎస్) 1,700 మెగావాట్ల స్టేషన్ ఉత్పత్తి లక్ష్యం ఏడాదికి దాదాపు 15 వేల మిలియన్ యూనిట్లు.. కానీ, గత ఏడాది అక్కడ అయిన విద్యుదుత్పత్తి 12 వేల మిలియన్ యూనిట్లే.
 
 అంటే 80 శాతం మేర లక్ష్యం పూర్తయింది. అదే లెక్కన జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్టులను కలిపి మొత్తం ఉత్పత్తి కావాల్సిన 17,520 మిలియన్ యూనిట్లలో 80 శాతం లెక్క వేసినా 14వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం వినియోగం ప్రస్తుతం చూస్తే గరిష్టంగా రోజుకు 160 మిలియన్ యూనిట్లు ఉంటుంది. అయితే, ప్రతియేటా ఈ వినియోగం 15 శాతం పెరుగుతుందని అంచనా. మన జిల్లాలో ప్రాజెక్టు పూర్తయి విద్యుత్పత్తి అందుబాటులోకి వచ్చే సమయానికి ఈ డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లపైగానే ఉంటుంది. ఈ లెక్కన ఏడాదికి 92 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి అవసరమవుతుంది. అందులో దాదాపు 14 వేల మిలియన్ యూనిట్లు మన జిల్లా నుంచే ఉత్పత్తి కానుందన్నమాట. అంటే మొత్తం తెలంగాణ అవసరాల్లో ఇది ఏడో వంతు.
 

Advertisement
Advertisement