Sakshi News home page

ఎస్సై కుటుంబాన్ని వేధిస్తున్న కానిస్టేబుల్

Published Sun, Jan 25 2015 6:39 AM

These points harassing the family of Constable

  • యాసిడ్ దాడికి యత్నాలు?
  • పట్టించుకోని ఉన్నతాధికారులు
  • కరీంనగర్ క్రైం : ప్రజల రక్షణ కోసం నిరంతరం తాపత్రాయపడే పోలీసులకే రక్షణ కరువైంది. ప్రాణభయంతో ఓ ఎస్సై కుటుంబం బిక్కుబిక్కుమంటోంది. ఈ కుటుంబాన్ని ఇంతలా భయపెడుతోంది కూడా ఓ పోలీసే కావడం, అదీ సాక్షాత్తూ ఉన్నతాధికారులంతా కొలువై ఉండే జిల్లాకేంద్రంలోనే కావడం గమనార్హం. జిల్లాకేంద్రంలోని ఓ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై... గతంలో పనిచేసిన చోట ఓ కానిస్టేబుల్ పై అధికారితో దురుసుగా ప్రవర్తించిన విషయమై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ నిర్వహించారు.

    ఆ నివేదిక ప్రకారం సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. అప్పటినుంచి ఆ ఎస్సైపై కక్షగట్టిన సదరు కానిస్టేబుల్ నిత్యం వేధింపులు ప్రారంభించాడు. వాహనానికి అడ్డు రావడం, ఇంటిపై రాళ్లు వేయడం, విధులను ఆటంకపరచడం చేస్తున్నాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌పై ఎస్సై, సీఐలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వన్‌టౌన్, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినా సదరు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు కనీసం పిలిచి మందలించలేదు.

    దీంతో మరింత రెచ్చిపోతున్న సదరు కానిస్టేబుల్ వారం రోజులుగా ఎస్సై కుటుంబంపై దాడికి యత్నిస్తున్నాడని సమాచారం. ఏకంగా యాసిడ్‌తో దాడికి ప్రణాళికలు వేస్తున్నాడని ఉన్నతాధికారులకు తెలిపినా కానిస్టేబుల్‌ను కట్టడి చేసే చర్యలు తీసుకోవడం లేదని తెలిసింది. భయభ్రాంతులకు గురవుతున్న ఎస్సై కుటుంబం వారి పిల్లలను పాఠశాలకు కూడా పంపించకుండా, బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు సమాచారం.

    రక్షణకోసం ఇంటి వద్ద బంధువులను కాపాలా పెట్టాల్సి వస్తోందని సన్నిహితుల వద్ద సదరు ఎస్సై వాపోయినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం బాధిత ఎస్సై ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌లో కేసు కూడా నమోదైంది.

Advertisement

What’s your opinion

Advertisement