బతుకులు శిథిలం | Sakshi
Sakshi News home page

బతుకులు శిథిలం

Published Sun, Mar 22 2015 9:54 AM

three family members died after fall down their house top

  •   మట్టిమిద్దె కూలి ముగ్గురు మృతి
  •   మృతుల్లో తల్లి, కూతురు, కుమారుడు
  •   కొప్పునూరులో విషాదఛాయలు
  •  తెల్లవారితో ఉగాది పండగ... ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు.  కానీ, ఆ రాత్రే తమ జీవితాలకు ముగింపు పలుకుతుందనుకోలేదు. 
     ఇన్నాళ్లూ తమను ఎండ, చలి, వానల నుంచి కాపాడిన ఆ ఇల్లే... తమ ప్రాణాలను తీసుకుంటుందని అనుకోలేదు. గాఢనిద్రలో ఉన్న ఆ ముగ్గురికి  అదే శాశ్వతనిద్ర అవుతుందని భావించలేదు. తల్లి పక్కనే పడుకున్నాం..  అన్న గుండె ధైర్యంతో ఉన్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తల్లితోనే గాల్లో కలిశాయి. అర్ధరాత్రి ఇల్లు కూలడంతో తల్లీ.. ఇద్దరు పిల్లలు వాటికిందే శిథిలమయ్యారు. ఈ ఘోరాన్ని చూడలేక గ్రామమంతా గొల్లుమంది. గ్రామస్తులు, మృతుల బంధువుల రోదనలతో గ్రామం కన్నీటి సంద్రమైంది.వీపనగండ్ల: ఉగాది వేళ ఆ ఇంట్లో విషా దం ఆవహించింది.. పిల్లాపాపలతో ఆనందంగా గడిపే ఆ కుటుంబం రోదనలు, వేదనలతో దుఃఖసాగరంలో ముని గింది. మట్టిమిద్దె కూలడంతో తల్లీబిడ్డలు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన శనివారం మండలంలోని కొప్పునూరులో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బడికెల ఎల్లస్వామి తన అత్తగారి ఊరు పాన్‌గల్ మండలం కల్వరాల గ్రామానికి వ్యక్తిగత పనిమీద శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. అయితే అతని భార్య సాయిలీల(30), కొడుకు వినేష్‌కుమార్ (7), కూతురు చిన్నారి దీపిక(4) కూతురుతో కలిసి ఇంట్రో రాత్రి భోజనానంతరం నిద్రకు ఉపక్రమించింది. అత్త లక్ష్మిదేవమ్మ ఇంటిముందు మంచంపై నిద్రించింది. తెల్లవారుజామున అత్త ముందుగానే నిద్రలేచి కోడలిని లేపేందుకు యత్నించింది. ఇంతలో ఇంటిపైకప్పు కూలడాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తలుపులు తెరిచి చూడగా ముగ్గురు అప్పటికే విగతజీవులుగా మారారు. విషయం తెలుసుకున్న ఎల్లస్వామి వెంటనే ఇంటికి చేరుకుని భార్యాపిల్లల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన రోదన అక్కడున్న ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇద్దరు పిల్లలు, భార్య చనిపోవడంతో ఇక తానేందుకు బతకాలి అంటూ..కన్నీరుమున్నీరు అవుతున్న అతడిని చూసి విచారం వ్యక్తంచేశారు. వీపనగండ్ల ఏఎస్‌ఐ వహిద్‌అలిబేగ్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
     భర్తకు తప్పిన ప్రమాదం
     ఎల్లస్వామి తన అత్తగారి ఊరుకు వెళ్లడంతో అతడికి ప్రమాదం తప్పినట్లయింది. లేకపోతే మిద్దెకూలి అతడు కూడా భార్యాపిల్లలతో పాటే చనిపోయేవాడని అయ్యో.. పాపం అని కంటతడిపెట్టారు. జెడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి లోకారెడ్డి, రాంచంద్రారెడ్డి, గోవింద్‌గౌడ్, కృష్ణప్రసాద్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ జగ్గారి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ బీచుపల్లియాదవ్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, బాలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. 
     

Advertisement
Advertisement