కరువు మేఘాలు..! | Sakshi
Sakshi News home page

కరువు మేఘాలు..!

Published Mon, Aug 31 2015 4:02 AM

Three lakh acres of cultivation away

జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, జలాశయాల్లోకి నీరు చేరక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 26 శాతం లోటుగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా జిల్లాలో మూడు లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేదు. అడపాదడపా కురిసిన వర్షాలకు సోయా, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పంటలు సాగు చేయగా.. పూత, కాత దశకు చేరాయి. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలో తేమ శాతం తగ్గి పంటలు రంగు మారుతున్నాయి.
 
- సాగుకు దూరంగా మూడు లక్షల ఎకరాలు
- పంట పూత, కాత దశలో కనిపించని వర్షాలు
- వరి సాగుకు రైతులు దూరం..
- జిల్లాలో 26 శాతం లోటు వర్షపాతం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ :
ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టాలే దిగుబడి అవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్నా.. దిగుబడి చేతికొచ్చే సమయంలో వర్షాల్లేక వాడిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. ఆరంభంలో కురిసిన వర్షాలకు సోయా, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటలు విత్తుకున్నారు. పంట ఎదిగే సమయం జూలైలో వర్షాలు మొహం చాటేశాయి. దీంతో పంట ఎండిపోతున్న సమయంలో ఆగస్టు నెల ఆరంభంలో కురిసిన మోస్తారు వర్షాలు పంటపై ఆశలు నిలిపింది. సోయా, పత్తి, కంది, పెసర, మొక్కజొన్న పంటలు పూత, కాత దశకు చేరాయి.

ఈ సమయంలో వర్షాల్లేకపోవడం, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమిలో తేమ శాతం తగ్గి పంటలు రంగు మారుతున్నాయి. మండుతున్న ఎండలతో పూత, పిందె రాలడం రైతులను మనోవేదనకు గురి చేస్తోంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఇప్పటికే సాధారణ సాగు కంటే మూడు లక్షల ఎకరాలు సాగుకు దూరంగా ఉన్నాయి. వరి 1.30 లక్షల ఎకరాల్లో నాట్లు వేయకపోవడంతో బీళ్లుగా మిగిలిపోయాయి. జిల్లాలో వరి నాట్లు వేసుకునే సమయం ఆగస్టుతో ముగిసింది. సాధారణ వర్షపాతం ఖరీఫ్ ఆరంభం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు 801.6 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటి వరకు 599.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే ఇంకా 26 శాతం లోటుగా ఉంది. జిల్లాలో ఎక్కువగా వర్షాధార పంటలే సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. వరితోపాటు ఇతర పంటలు 3 లక్షల ఎకరాల వరకు సాగుకు నోచుకోలేదు.
 
తేమ తగ్గుతున్న నేలలు..

జిల్లాలో 6.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగువుతాయని అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి వరకు 4.98 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. పత్తి, సోయా పంటలు విత్తుకునేందుకు గత నెలతో గడువు ముగియగా వరి, కంది, పెసర ఇతర పంటలు వేసుకునేందుకు ఆగస్టుతో ముగిసింది. సోయా పంట కాత కాసి దిగుబడి వచ్చే సమయంలో రంగు మారడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం పూత దశలో రంగు మారుతోంది. పత్తి పూత, పిందె దశలో ఉంది ఈ సమయంలో నీటితడులు ఉంటే కాత బాగా కాసి వృద్ధి చెంది దిగుబడులు బాగా వస్తాయి. కానీ పదును లేక పూత రాలడం, పింద వృద్ధి చెందకుండా రాలిపోతోంది. ఇతర పంటలదీ అదే పరిస్థితి. ఈ సమయంలో ఒక్క భారీ వర్షం కురిసినా కాత నిలబడి దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజులు వర్షాల్లేకపోతే పెట్టుబడీ రాని పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు.
 
వరి సాగు హరి..
జిల్లాలో ఆశించిన వర్షాలు లేక వరి నారు పోసుకుని పొలంలో నాట్లు వేసుకునే గడువు దాటిపోయింది. గడువు దాటిన తర్వాత నాట్లు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఎండిపోయి, ముదిరిపోతున్న వరినారుమళ్లను చాలా మంది రైతులు వృథాగా వదిలేశారు. 70 వేల హెక్టార్లలో నాట్లు వేసుకోవాల్సి ఉండగా.. 15 వేల హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాలో ప్రధానంగా జలాశయాల కిందనే ఎక్కువగా సాగువుతుంది. జలాశయాల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటితడులు అందవేమోనని నాట్లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే నారుమళ్లలో పశువులను వదులుతున్నారు.
 
32 మండలాల్లో లోటు వర్షపాతం
జిల్లాలో సాధారణ వర్షపాతం 802.6 మిల్లీమీటర్లకు గాను ఇప్పటి వరకు 599.2 మిల్లీమీటర్లు కురిసింది. 52 మండలాలకు గాను 32 మండలాల్లో సాధారణం కంటే 50 శాతం నుంచి 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మిగితా 15 మండలాల్లో 80 శాతం నుంచి 96 శాతం వర్షపాతం నమోదు అయింది. జిల్లాలో నాలుగు వ్యవసాయ డివిజన్లు ఉండగా.. ఆదిలాబాద్ డివిజన్‌లో సాధారణ వర్షపాతం 7807.9 మిల్లీమీటర్లు కాగా 6150.2, ఆసిఫాబాద్ డివిజన్‌లో 7398.3 మిల్లీమీటర్లుకు గాను 5600.2, మంచిర్యాలడివిజన్‌లో 9608.5 మిల్లీమీటర్లకు గాను 7895.6, నిర్మల్ డివిజన్‌లో 9695.0 మిల్లీమీటర్లకు గాను 6686.6, ఉట్నూర్ డివిజన్‌లో 6778.1 మిల్లీమీటర్లకు గాను 4837.4 మిల్లీమీటర్లు నమోదైంది.
 
పూత దశలో వర్షాల్లేవు
పడుతలేవు..    పత్తి పంట పూతకు వచ్చింది. ఈ సమయంలో వర్షాలు కురవడం లేదు. పదిహేను రోజులు దాటింది. ఈ సమయంలో ఒక భారీ వర్షం కురుస్తే దిగుబడి మంచిగా వస్తాది. లేకపోతే పంట పెట్టుబడి ఎళ్లడం కష్టమే.
- అన్నం లింగన్న, బట్టిసావర్‌గాం
 
పత్తికి డీఏపీ వేయండి..
పత్తి పంటలో తేమ తగ్గడం, ఉష్ణోగ్రత పెరగడం వల్ల తామర పురుగు, తెల్లదోమ ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. దీని నివారణకు డీఏపీ 4 కిలోలు, అగ్రోమిన్ మాక్స్ 1 కిలో ఎకరానికి లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సోయా పంట తెల్లదోమతో పసుపు ఆకులు రంగులోకి మారుతున్నాయి. దీని నివారణకు ఎసీటోఫిన్, నువాన్, లేదా ఫ్రోఫినో ఫాస్ 3 మిల్లీమీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- రాజశేఖర్, ఏరువాక శాస్త్రవేత్త, సమన్వయకర్త

Advertisement
Advertisement