గ్రామ కంఠం ప్రభుత్వ భూమి కాదు | Sakshi
Sakshi News home page

గ్రామ కంఠం ప్రభుత్వ భూమి కాదు

Published Sat, May 30 2015 1:44 AM

throat is the land of the village

ఆ భూములపై సర్కారు ఎలాంటి హక్కూ కోరజాలదు
రిజిస్ట్రేషన్ నిరాకరించలేరు హైకోర్టు కీలక తీర్పు

 
హైదరాబాద్: గ్రామ కంఠం భూములు ఎవరి స్వాధీనంలోనైనా ఉంటే, వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ భూములను ప్రభుత్వ నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదంది. ఒకవేళ చేరిస్తే అది చట్ట విరుద్ధమవుతుందని స్పష్టం చేసింది. ఓ భూమిని ఒకసారి గ్రామ కంఠంగా వర్గీకరిస్తే, దానిపై ప్రభుత్వం హక్కును కోరజాలదంది.అది ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందన్న కారణంతో రిజిస్టర్ చేసేందుకు నిరాకరించడానికి వీల్లేదంది. ఈ మేరకు జస్టిస్ సరస వెంకట నారాయణ బట్టి (ఎస్.వి.భట్) ఇటీవల కీలక తీర్పునిచ్చారు. విజయనగరం జిల్లా, సాలూరు గ్రామం, సర్వే నంబర్ 162/2 (పార్ట్)లోని ఓ ఇంటిని ఎస్.విజయ అనే మహిళ కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్‌కని సబ్ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించగా.. గ్రామ కంఠం భూమని, నిషేధిత జాబితాలో చేర్చినందువల్ల రిజిస్ట్రేషన్ కుదరదని ఆయన చెప్పారు. దీంతో విజయ హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న న్యాయమూర్తి ఎస్.వి.భట్ తీర్పు వెలువరించారు. ‘రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్), ఇతర రెవిన్యూ రికార్డులను ఆధారంగా చేసుకుని గ్రామ కంఠం భూములను నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లోని కాలమ్ 4 ప్రభుత్వ, ఇనామ్ భూముల గురించి చెబుతుంది. ఇందులో ఉన్న వివరాల ఆధారంగా గ్రామ కంఠం భూములపై ప్రభుత్వానికి మాత్రమే యాజమాన్యపు హక్కు ఉంటుందనే తుది నిర్ణయానికి రావడానికి వీల్లేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠం (తెలుగు), గ్రామ నాథం (తమిళం) పదాలను ఉపయోగిస్తున్నారు. ఎస్టేట్ , రైత్వారీ గ్రామా ల్లో.. ఇళ్లు, గుడిసెల నిర్మాణానికి కొంత భూమిని కేటాయించే వారు. దీన్ని గ్రామ కంఠంగా వ్యవహరిస్తారు. ఆ భూములు అత్యధిక భాగం ప్రైవేటు వ్యక్తుల వద్దనే ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఎ కింద నిషేధిత జాబితాలో చేర్చడం చట్ట విరుద్ధం.ప్రభుత్వం తమ ఉత్తర్వుల ద్వారా ఎప్పుడో పరిష్కారమైన వాటిని అపరిష్కృతంగా మారుస్తోంది. మద్రాసు ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం లేదా ఎస్టేట్స్ చట్టం ప్రకారం చూసినా గ్రామ కంఠం  ప్రభుత్వ భూమి కాదు. ఈ కారణంతో రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్ట విరుద్ధం.’ అని జస్టిస్ భట్ స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement