తెలంగాణలో పులులు 26 | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పులులు 26

Published Tue, Jul 30 2019 1:17 AM

Tigers Count In Telangana Is 26 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు లెక్క తేలింది. గతంతో పోలిస్తే వీటి సంఖ్య పెరిగినట్లు కేంద్రం ప్రకటించిన నివేదికలో వెల్లడైంది. సోమవారం అంతర్జాతీయ పులు ల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యపై ప్రధాని నరేంద్ర మోదీ నివేదిక విడుదల చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా అధికారికంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. కేంద్ర అటవీ శాఖ పరిధిలోని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ప్రతి నాలుగేళ్లకోసారి (2006 నుంచి) రాష్ట్రాల్లోని పులుల గణన చేపట్టి అధికారికంగా ప్రకటిస్తోంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, టైగర్‌ రిజ ర్వ్‌లు ఇలా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాలన్నింటిలో పులుల ను అంచనా వేసేందుకు 2018 జనవరిలో అధ్యయనం నిర్వహించారు.  

ఆమ్రాబాద్‌లో 14 పులులు
2014లో ఉమ్మడి ఏపీలో పులుల సంఖ్య 68 ఉన్నాయని, వాటిలో తెలంగాణలో 20 (ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 17, కవ్వాల్‌ పులుల అభయారణ్యంలో 3 ఉన్నాయని అంచనా వేశారు. ప్రస్తుతం ఆమ్రాబాద్‌లో 14, కవ్వాల్‌లో 12 ఉండొ చ్చని ఆయా డివిజన్లలోని అటవీ అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 

నాగర్‌ కర్నూల్, నల్లగొండ.. 
నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలోకి వచ్చే కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లున్నాయి. ఈ ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాంతం తూర్పు కనుమల కిందకు వస్తాయి. ఈ రెండు అభయారణ్యాల్లోనూ మెరుగైన నిర్వహణ పద్ధతులను అవలంబిస్తున్నట్టు, గతంతో పోలిస్తే కవ్వాల్‌ రేటింగ్‌ ‘ఫెయిర్‌’నుంచి ‘గుడ్‌’స్థానానికి (స్కోర్‌ 60.16%) పెరగగా, ఆమ్రాబాద్‌ ‘గుడ్‌’స్థానంలో (స్కోర్‌71.09%) కొనసాగుతున్నట్లు నివేదికలో స్పష్టమైంది. టైగర్‌ రిజర్వ్‌ల నిర్వహణలో మొత్తంగా రాష్ట్రం స్కోర్‌ 71.09% సాధించింది. రెండు రిజర్వ్‌లు కలిపి దాదాపు 5 వేల కి.మీ చదరపు కి.మీ విస్తీర్ణం ఉన్నందున, వంద దాకా పులుల సంరక్షణకు ఇక్కడ అవకాశాలున్నాయని వైల్డ్‌లైఫ్‌ ఓఎస్డీ శంకరన్‌ ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని పులుల సంఖ్య 36కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌సీటీఏ ప్రకటించిన వివరాలు మనకు బేస్‌లైన్‌ డేటాగా ఉపయోగపడుతుందని, 26 పులులు ఉన్నట్లు తేలడం అటవీ శాఖకు, రాష్ట్రానికి ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. పులిపిల్లలు ఆరు దాకా ఉన్నందున అవి పెరిగి పెద్దయ్యేందుకు పటిష్టమైన సంరక్షణ, నిర్వహణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. కాగా, ఉమ్మడి ఏపీలో 2006లో 95, 2010లో 72, 2014లో 68 (తెలంగాణలో 20), 2018 తాజా లెక్కల్లో తెలంగాణలో 26 పులులున్నట్లు తేలింది. 

అటవీ రక్షణ చర్యలతో పులుల వృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యలతో పులుల సంఖ్య 26కు పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ, అటవీ సంరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వాటిని కాపాడుకోవడానికి అందరూ మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. 

Advertisement
Advertisement