పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం | Sakshi
Sakshi News home page

పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం

Published Mon, Mar 7 2016 1:57 AM

పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం

కార్యాచరణ రూపొందిస్తున్నాం: మంత్రి లక్ష్మారెడ్డి
బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ విభాగం ప్రారంభం
త్వరలో ఇన్ పేషంట్ విభాగాన్ని ప్రారంభిస్తామని వెల్లడి
 

బీబీనగర్: రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపురంలోని నిమ్స్ యూనివర్సిటీలో ఆదివారం ఔట్ పేషంట్ (ఓపీ) విభాగాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..  ఔట్ పేషెంట్ విభాగంలో అన్ని రకాల ప్రాథమిక వైద్యం అందిస్తామని, అవసరమైన రోగులను అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్ చేయనున్నట్లు తెలిపారు.

వైద్య రంగాన్ని అభివృద్ధి చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి పేర్కొన్నారు. బీబీనగర్ నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించి హైదరాబాద్ నిమ్స్ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిమ్స్ డెరైక్టర్ మనోహర్‌రావు, డిప్యూటీ డెరైక్టర్ కేటీ రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement