సిరిసిల్లలో ఉద్రిక్తత.. ఉత్కంఠ | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఉద్రిక్తత.. ఉత్కంఠ

Published Mon, Jul 31 2017 1:26 AM

సిరిసిల్లలో ఉద్రిక్తత.. ఉత్కంఠ - Sakshi

దళితులపై థర్డ్‌ డిగ్రీని నిరసిస్తూ నేడు కాంగ్రెస్‌ పార్టీ సభ  
- అనుమతి నిరాకరించిన కలెక్టర్‌ 
హైకోర్టును ఆశ్రయించిన నేతలు  
కరీంనగర్‌కు చేరుకున్న మీరాకుమార్‌ 
 
సిరిసిల్ల:  కాంగ్రెస్‌ పార్టీ  సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సభపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంపై కాంగ్రెస్‌ ఆందోళనకు పూనుకుంది. ఈ క్రమంలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కచ్చితంగా సభను నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన నేపథ్యంలో సిరిసిల్లతో పాటు పాత కరీంనగర్‌ జిల్లాలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ సభలో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఇప్పటికే కరీంనగర్‌కు చేరుకున్నారు. ఈ సభకు అనుమతి నిరాకరిçస్తున్నట్లు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ శనివారం ప్రకటించారు. దీంతో సభకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉం దని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

సభను అడ్డుకునేందుకు పోలీసులు జిల్లాలో పోలీస్‌– 30 యాక్ట్‌ను అమలులోకి తీసుకొచ్చారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించరాదని డీఎస్పీ చంద్రశేఖర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు నిర్ణయంపైనే బహిరంగసభ నిర్వహణ ఆధారపడి ఉంది. సభ నిర్వహణ కోసం ఐదురోజుల కిందటే జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించగా.. శనివారం అనుమతి నిరాకరించారు. సీఎంవో ఆదేశాల మేరకే సభకు అనుమతి నిరాకరించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం కోర్టు బంద్, సోమవారం సభ నిర్వహణకు అనుమతి లభించదనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా కలెక్టర్‌ ద్వారా ప్రకటన చేయించారని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నిరాకరణ పత్రాన్ని సవాల్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement
Advertisement