సీఎంగా తొలి అడుగు | Sakshi
Sakshi News home page

సీఎంగా తొలి అడుగు

Published Tue, Sep 9 2014 4:00 AM

tour in kcr waragal

  • నేడు కేసీఆర్ రాక
  •  కాళోజీ శతజయంతి ఉత్సవాలకు హాజరు
  •  కళాకేంద్రానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
  • సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. వరంగల్ నగరంలో మంగళవారం జరిగే ప్రజాకవి కాళోజీ నారాయణరావు శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరవుతున్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణలోనే సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ జిల్లాలో కాళోజీ కళా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హన్మకొండ బాలసముద్రంలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుంది.

    హైదరాబాద్‌లోని సాంస్కృతిక కేంద్రం రవీంద్రభారతికి రెట్టింపు స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాళోజీ కళా కేంద్రం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కళా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో నిర్వహించే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉద్యమ నాయకుడిగా అనేకసార్లు జిల్లాకు వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ముఖ్యమంత్రి తొలి పర్యటన కావడంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముఖ్యమంత్రి పర్యటన ఖరారై వారం దాటినా... ఇంకా హడావుడిగానే పనులు చేస్తున్నారు. కేసీఆర్ తొలి పర్యటన నేపథ్యంలో టీఆర్‌ఎస్ జిల్లా శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.  

    వరంగల్, హన్మకొండ నగరాలను గులాబీ ఫ్లెక్సీలతో అలంకరించారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు పోటాపోటీగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముస్తాబు చేశారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఈ ఏడాది ఏప్రిల్ 26న చివరిసారిగా స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, నర్సంపేట, పరకాల సభలకు వచ్చారు.
     
     సీఎం పర్యటన ఇలా..
     ఉదయం :
     11 : 40 - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)కి చేరుకుంటారు.
     11 : 45 - రోడ్డు మార్గంలో నిట్ నుంచి బయలుదేరుతారు.
     11 : 51 - కాళోజీ సెంటర్‌లోని కాళోజీ విగ్రహానికి నివాళులర్పిస్తారు.
     11 : 55 - బాలసముద్రంలో కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు.

     మధ్యాహ్నం :
     12 : 05 - బాలసముద్రం నుంచి నిట్‌కు బయలుదేరుతారు.
     12 : 10 - నిట్‌లోని అబ్దుల్ కలాం గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
     12 : 10 నుంచి 12 : 30 వరకు అబ్దుల్ కలాం గెస్ట్‌హౌజ్‌లో ఉంటారు.
     12 : 30 - కాళోజీ శతజయంతి ఉత్సవాల సభకు బయలుదేరుతారు.
     12 : 32 నుంచి 1 : 30 వరకు ఉత్సవాల సభలో పాల్గొంటారు.
     1 : 30  - నిట్ నుంచి బయలుదేరుతారు
     1 : 35 - కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు.
     1 : 35 నుంచి 2 : 10 వరకు మధ్యాహ్న భోజనం
     2 : 15 - లక్ష్మీకాంతరావు ఇంటి నుంచి బయలుదేరుతారు
     2 : 20 - హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement