మున్సి‘పోల్స్‌’పై పిల్‌ | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’పై పిల్‌

Published Thu, Jan 2 2020 3:06 AM

TPCC Chief Filed Over Municipal Polls In High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాల్టీల్లో వివిధ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పిల్‌ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దీనిపై విచారించనుంది. గత నెల 23న ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాలని, దీనిని రీషెడ్యూల్‌ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని, పిల్‌పై తుది ఉత్తర్వులు వెలువడే వరకూ షెడ్యూల్‌పై ఏవిధంగా ముందుకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. ఈ నెల 7న రాష్ట్ర ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయబోతుందని, ఈప్రక్రియను నిలిపివేయాలని కోరారు.

ఈనెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎస్‌ఈసీకి ఇస్తుందని, ఆ తర్వాత ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తుందని, రిజర్వేషన్ల ఖరారుకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి మధ్యలో ఒక్క రోజు మాత్రమే గడువు ఉందని పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఒక్క రోజు వ్యవధిలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందడం కష్టమని, కనీసం వారం రోజుల వ్యవధి ఉండేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. షెడ్యూల్‌ విడుదల చేసే నాటికి ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాలేదని, ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వ్యవధి తక్కువగా ఉండటం వల్ల అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, రిజర్వేషన్ల ఖరారులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పడానికి, సమస్యపై వివరించేందుకు వారం రోజులు సమయం ఉండేలా చేయాలని పిల్‌లో పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.

Advertisement
Advertisement