పంజాబ్‌ స్ఫూర్తిగా పాగా వేద్దాం..! | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ స్ఫూర్తిగా పాగా వేద్దాం..!

Published Mon, May 8 2017 2:03 AM

పంజాబ్‌ స్ఫూర్తిగా పాగా వేద్దాం..! - Sakshi

► రిజర్వుడు నియోజకవర్గాలపై టీపీసీసీ దృష్టి
► ఏఐసీసీ పర్యవేక్షణలో అమలు
► ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించిన టీపీసీసీ సమన్వయకర్త


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రిజర్వుడు నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేయనుంది. దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్న ఈ వ్యూహం ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్ఫలితాలనిచ్చింది. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి టీపీసీసీ నిర్ణయించింది. ఈ వ్యూహాన్ని ఏఐసీసీ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం రాహుల్‌ గాంధీ కొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోనూ పలు సంస్కరణలను, వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించారని టీపీసీసీ ముఖ్యుడొకరు వెల్లడించారు.

దేశవ్యాప్త వ్యూహంలో భాగంగా‘లీడర్‌ షిప్‌ డెవలప్‌ మెంట్‌ మిషన్‌’పేరుతో రిజర్వుడు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసి, మొదటగా పంజాబ్‌లో దీనిని కాంగ్రెస్‌ అమలుచేసింది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఎన్నికల్లో 33 రిజర్వుడు నియోజకవర్గాలలో ఈ వ్యూహాన్ని అమలుచేయగా 23 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని సాధించింది. ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయనున్నారు. దీనిలో భాగంగా ఏఐసీసీ నుంచి ఒకరు కన్వీనరుగా, రాష్ట్రం నుంచి ఒకరు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు అన్ని రాష్ట్రాల్లో ఈ ఫార్ములా అమలుకోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణపై దృష్టిపెట్టారు.

31 నియోజకవర్గాలు..310 మంది...
రాష్ట్రంలో 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వ్యూహంలో భాగంగా టీపీసీసీ నిర్ధిష్టమైన కార్యాచరణతో పనిచేయనుంది. టీపీసీసీ నుంచి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు సమన్వయకర్తగా వ్యవహరించనున్నా రు. ఇప్పటికే ఆయన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌ పాత జిల్లాల్లోని రిజర్వుడు నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటన పూర్తయిన తరువాత నియోజకవర్గాల స్వరూపంపై దృష్టిపెట్టనున్నారు. ఈ ఫార్ములాలో భాగంగా ముందుగా ప్రతీ నియోజవర్గం నుంచి పదిమంది కార్యకర్తలను ఎంపిక చేసుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో రిజర్వుడు సామాజిక వర్గాలను కాకుండా ఇతర బలమైన సామాజికవర్గాలను ఎంపిక చేసుకుంటారు.

మొత్తం 31 నియోజకవర్గాలకు గాను 310 మందిని ఎంపిక చేసుకున్న తరువాత నేరుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో వీరి సమావేశం ఏర్పాటు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా రెండు రోజుల పాటు శిక్షణ కూడా ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ పది మంది నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వీరు ప్రతీ గ్రామంలో ఐదు నుంచి పది మందిని ఎంపిక చేసుకుని, వారిని పార్టీకోసం పనిచేసే విధంగా సిద్ధం చేస్తారు.

వీరంతా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు లేదా ఎమ్మెల్యే అభ్యర్థికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వడంతో పాటు పార్టీ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలకోసం సలహాలను ఇస్తారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి ఆర్థికంగా ఏఐసీసీ, టీపీసీసీ నుంచి నేరుగా సహాయం అందించాలని కూడా నిర్ణయించారు. ఈ వ్యూహంలో ఏఐఐసీ పర్యవేక్షణ ఉన్నా టీపీసీసీ ప్రధానపాత్ర పోషించనుంది. ఈ వ్యూహం కచ్చితంగా సానుకూల ఫలితాలను ఇస్తుందనే విశ్వాసంతో టీపీసీసీ ఉంది.

Advertisement
Advertisement