హాఫ్‌ హెల్మెట్‌కు ఈ–చలాన్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

ఓన్లీ ఫుల్‌..

Published Thu, Oct 3 2019 8:38 AM

Traffic Challan For Half Helmet in Hyderabad - Sakshi

గచ్చిబౌలిలో ఉండే అరుణ్‌ కుమార్‌ మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వెళ్లే ఇతడు హెల్మెట్‌ ధరించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు చాలాసార్లు ఈ–చలాన్‌ విధించారు. ఇలా అయితే కష్టమని.. పోలీస్‌ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు బైక్‌పై వెళ్లేటప్పుడు ‘హాఫ్‌ హెల్మెట్‌’ (ప్లాస్టిక్‌ క్యాప్‌ మాదిరిది) ధరించసాగాడు. తాను హెల్మెట్‌ ధరిస్తున్నందున చలాన్‌ రాదనుకున్నాడు. ఓసారి ట్రాఫిక్‌ పోలీసులు అరుణ్‌ బైక్‌ ఆపి తనిఖీ చేయగా.. హెల్మెట్‌ ధరించడం లేదంటూ పదుల సంఖ్యలో ఈ–చలాన్లు చేతికివ్వడంతో షాక్‌ తిన్నాడు.  

సాక్షి,సిటీబ్యూరో: శంషాబాద్‌లో నివాసముండే శివాజీ మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైక్‌పై వచ్చి వెళుతుంటాడు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఆపడంతో హెల్మెట్‌ ధరించని కారణంగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తలకు హెల్మెట్‌ పెట్టుకునేందుకు ఇష్టపడని శివాజీ.. ‘కన్‌స్ట్రక్షన్‌ హెల్మెట్‌’ (ప్లాస్టిక్‌ క్యాప్‌)ను ధరించసాగాడు. అయినా శివాజీకి ‘వితవుట్‌ హెల్మెట్‌’ అని ఈ–చలాన్‌లు జారీ అవుతుండడంతో ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించగా.. హాఫ్‌ హెల్మెట్‌ క్యాప్‌గా పరిగణిస్తామని షాకిచ్చారు. 

...ఈ రెండు కేసుల్లోనే కాదు.. హాఫ్‌ హెల్మెట్లు వాడుతున్న చాలామంది ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల నుంచి ఈ–చలాన్లు జారీ అవుతున్నాయి. దీంతో పోలీసులు కనీస పరిజ్ఞానం లేకుండా జరిమానాలు విధిస్తున్నారంటూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన సమయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తాము ధరించింది హెల్మెట్‌ అంటూ పోలీసులతోనే వాదిస్తున్నారు. మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం హెల్మెట్లు ధరిస్తున్నప్పుడు తమకు జరిమానాలు ఎందుకు విధిస్తున్నారంటూ అవేశపడుతున్నారు. అయితే.. ఎంవీయాక్ట్‌ ప్రకారం తలను పూర్తిగా కప్పి ఉంచేదే హెల్మెట్‌ అని, అది ఉంటేనే ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలు నిలబడతాయని.. క్యాప్‌ మాదిగా ఉన్నది హెల్మెట్‌ కిందకు రాదని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. అందుకే చట్టప్రకారం వారికి ‘వితవుట్‌ హెల్మెట్‌’ అనే అప్షన్‌తో జరిమానా విధిస్తున్నామంటున్నారు. 

‘‘కేవలం ట్రాఫిక్‌ పోలీసుల జరిమానాల నుంచి తప్పించుకునేందుకే హాఫ్‌ హెల్మెట్లను బలవంతంగా ధరిస్తూ నిబంధనలు పాటిస్తున్నామని భావిస్తున్న వాహనదారులు.. ప్రమాదం జరిగినప్పుడు తమ ప్రాణానికి ఆ సగం హెల్మెట్లు ఏమాత్రం కనీస రక్షణనివ్వవన్న సంగతి మరిచిపోతున్నారు.’’  

వాహనదారులూ.. ఇది మీ మంచికే..  
ట్రాఫిక్‌ పోలీసులు ఈ–చలాన్‌లు జారీ చేస్తుండడంతో హెల్మెట్లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, చాలా మంది హెల్మెట్‌ ఉండి వాడకుండా బైక్‌కు వెనకవైపు పెట్టుకొని డ్రైవ్‌ చేస్తున్నారు. ఈ విధంగానే గత నెల 29వ తేదీన పులిజా విజయ్, మరో వ్యక్తి అనిల్‌ కుమార్‌తో కలిసి బుల్లెట్‌ బైక్‌ (టీఎస్‌13ఈఎం 8214)పై వెళుతుండగా అరామ్‌ఘర్‌ అండర్‌పాస్‌ వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న ఎలక్ట్రిక్‌ స్తంభాన్ని తాకడంతో తలకు తీవ్రగాయాలైన పులిజా విజయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్‌ తలకు పెట్టుకోవల్సిన హెల్మెట్‌ను బండి వెనకాల తగిలించుకున్నాడు. అదే హెల్మెట్‌ను ధరించి ఉంటే తలకు స్వల్పగాయాలై బయటపడి ఉండేవాడని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ చెప్పారు. గాయాలైన మరోవ్యక్తి అనిల్‌కుమార్‌ చికిత్స పొందుతున్నాడు. ఈ ఒక్క సంఘటనే కాదు చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ ఉండి కూడా ధరించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. వాహనదారులు పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు హాఫ్‌ హెల్మెట్లు వాడుతున్నారని, ఇది వారికి మంచిది కాదన్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఆ హెల్మెట్‌ గాయాల తీవ్రతను తగ్గించాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విజయ్‌ కుమార్‌ స్పష్టం చేస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement