‘ఆటో’ మెటిక్‌గా లైన్‌లోకి వచ్చేస్తాడు..

16 Oct, 2019 12:04 IST|Sakshi

ఓ ఎస్‌ఐ వసూళ్ల భాగోతం

ఇన్‌చార్జ్‌ లేకపోవడంతో ఆడింది ఆట

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో ఏ ఆటోవాలాను ఆయన గురించి ప్రశ్నించినా వామ్మో ఆయన మామూలు పోలీసు కాదు.. మామూళ్ల పోలీసంటూ టక్కున చెప్పేస్తారు. ఎస్‌ఆర్‌నగర్, మైత్రివనం నుంచి బయల్దేరిన ఆటోలు గమ్యం చేరే వరకు ఎవరూ పట్టుకోకూడదు. పొరపాటున ఏ ఆటోనైనా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులోగానీ, ముందున్న తనిఖీల వద్దగానీ ఎవరైనా పట్టుకుంటే క్షణాల్లోనే సదరు  పోలీసాఫీసరు లైన్‌లోకి వచ్చేస్తాడు... ‘వదిలెయ్‌ భయ్‌..మనోడే’ అంటూ మెల్లగా చెప్తాడు... విశేషమేంటంటే పోలీస్‌ స్టేషన్‌ పరిధులకు అతీతంగా ఆయన రెఫెన్సులుంటాయి.. చేసే పనికి తగ్గట్లు టారిఫ్‌లు కూడా ఉంటాయి. ఇంతిస్తే.. అరే ఇంతే ఇస్తవా భయ్‌... నీకు చేసిన పనేంది... నువ్వు ఇచ్చేది ఏంది అంటూ పైగా దబాయింపులు... ఆయన ఇంటి దగ్గర ఏదైనా పని పడిందంటే ఏదో ఒక ఆటోవాలాకు మూడినట్లే... క్షణాల్లో ఆటోవాలాలు ఆయన ఇంటి ముందు వాలిపోయి ఆదేశించిన పనిని చక్కబెట్టాల్సిందే... లేదంటే ‘టోల్‌’ తీస్తాడు. ఓ ఘటనలో ఈ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రవర్తించిన తీరు మరీ విచిత్రంగా ఉంది.

కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో కొందరు సరైన పత్రాలు లేని, నంబర్‌ ప్లేట్‌ సరిగ్గా లేని ఆటో వాలాలను ఆపిన కానిస్టేబుల్‌కు ఆయన ఫోన్‌ చేసి వదిలెయ్యమని చెప్పాడు. దీంతో సదరు కానిస్టేబుల్‌ మీరు చెప్తే వదలడం కుదరదని, తమ పరిధిలోని సెక్టార్‌ ఎస్‌ఐగానీ, జూబ్లీహిల్స్‌ సీఐగాని చెబితే వదిలేస్తాం కానీ మీకేం సంబంధం అన్నాడు. దీంతో   డ్యూటీలోనే ఉన్న సదరు ఎస్‌ఐ సార్‌. రయ్‌..మంటూ యూనిఫాంలో బైక్‌ వేసుకొని జూబ్లీహిల్స్‌ పోస్టులో పని చేస్తున్న కానిస్టేబుల్‌పై రంకెలేశాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయినా తీరు మారని ఎస్‌ఐ తన దందా కొనసాగిస్తూనే ఉన్నాడు. రెక్కాడితే డొక్కాడని ఆటోవాలాలను బ్లాక్‌మెయిల్‌చేస్తూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని ఎవరైనా పోలీసులు పట్టుకున్న ప్రతిసారీ విడిపిస్తూ డబ్బులు దండుకుంటున్నాడని ఆటోవాలాలు వాపోతున్నారు. దీనికి తోడు ఆయన పని చేస్తున్న పోలీస్‌ స్టేషన్‌లో ఆయనతో పాటు పని చేస్తున్న మరో అధికారి పదోన్నతి మీద వెళ్ళిపోవడంతో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ మొదలుకొని ఆయన సెక్టార్‌లోని చిరు వ్యాపారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులు ఎవ్వరినీ వదలకుండా దందాకు దిగుతున్నాడు. మూడేళ్లు గడుస్తున్నా ఆయన పని చేస్తున్న పోలీస్‌ స్టేషన్‌ను విడవకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా మామూళ్ల వసూళ్లలో బిజీగా ఉన్నాడు.

నన్నెవరూ ఏం చేయలేరంటూ...  
సదరు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐకి డీఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఓ ఎస్‌ఐ ఇటీవలే బదిలీ కావడంతో ఈ వసూల్‌ రాజా ఒక్కడే మిగిలారు.. దీంతో తననెవరూ ఏమీ చేయలేరని దర్జాగా అన్ని పోలీస్‌ స్టేషన్లూ చుట్తేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా