ఇద్దరి ప్రాణాలు మింగిన ఆట | Sakshi
Sakshi News home page

ఇద్దరి ప్రాణాలు మింగిన ఆట

Published Thu, Aug 23 2018 2:38 AM

Tragedy at the Chilkalguda Railway Quarters - Sakshi

హైదరాబాద్‌: ఇద్దరు చిన్నారులు ఆడుకోవడానికి భవనం పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన బాధిత తల్లిదండ్రులతోపాటుగా స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు కథనం మేరకు..రైల్వే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బీదర్‌కు చెందిన కృష్ణప్రసాద్, రేణుక దంపతులకు ఏడాదిన్నర పాప శ్రావ్య. రైల్వే ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బాబురావు, సుమిత్ర దంపతుల కుమార్తె పల్లవి (12). ఈ రెండు కుటుంబాలు చిలకలగూడలోని రైల్వే క్వార్టర్‌ నంబర్‌ 1010/ 9, 10 ఇళ్లలో నివసిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి శ్రావ్యతోపాటు పల్లవి ఆడుకుంటూ మూడవ అంతస్తుపైకి వెళ్లారు. టెర్రాస్‌ పిట్టగోడ ఒకటిన్నర అడుగుల ఎత్తే ఉండటంతో ప్రమాదవశాత్తు శ్రావ్య కిందపడబోయింది.

వెంటనే పల్లవి శ్రావ్య గౌను పట్టుకుని గట్టిగా కేకలు వేసింది. కింది అంతస్తులో ఉన్న రేణుక పైకి వచ్చేలోగా గాలిలో వేలాడుతున్న శ్రావ్య గౌను చిరగడంతో పల్లవి వదిలేసింది. దీంతో కింద పార్కింగ్‌ చేసిన కారుపై శ్రావ్య పడిపోయింది. పైకి వస్తున్న శ్రావ్య తల్లికి పెద్ద శబ్దం వినిపించ డంతో కిందికి పరుగులు తీసింది. అయితే టెర్రాస్‌పైనే ఉన్న పల్లవి బ్యాలెన్స్‌ కోల్పోయి తలకిందులుగా కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది. కారుపై పడిన చిన్నారి శ్రావ్యకు తీవ్ర గాయాలు కావడంతో ద్విచక్ర వాహనంపై లాలాగూడ రైల్వే ఆస్పత్రికి అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రావ్య మృతి చెందింది. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. 

పరామర్శించిన మంత్రి పద్మారావు: సమాచారం అందుకున్న అబ్కారీమంత్రి తీగుళ్ల పద్మారావు బుధవారం ఉదయం గాంధీ మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో మృతుల తల్లిదండ్రులు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను తరలించేందుకు అవసరమైన రవాణా ఖర్చులను మంత్రి పద్మారావు చెల్లించారు. 

పట్టుకునేందుకు పరిగెత్తా 
అమ్మా అంటూ పల్లవి కేకలు  వినిపించడంతో బయటకు వచ్చి చూశాను. ఎదురుగా ఉన్న క్వార్టర్స్‌ పై అంతస్తులో శ్రావ్య వేలాడుతూ, ఆమెను పట్టుకుని పల్లవి కనిపించారు. కిందపడితే పట్టుకుందామని పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆలోపే శ్రావ్య కారుపై పడిపోయింది. రెండు అడుగులు వేసేలోగా పల్లవి కూడా తన కాళ్ల వద్దే పడి మృతి చెందింది. బాధగా ఉంది.    
– హిమబిందు, ప్రత్యక్షసాక్షి 

ఆస్పత్రికి తరలించా 
డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాను. ఇంతలో క్షణాల వ్యవధిలో రెండు మార్లు పెద్ద శబ్దం వినిపించింది. బయటకు వచ్చి చూసేసరికి పల్లవి రక్తపుమడుగులో పల్లవి, కారుపై శ్రావ్యలు పడిఉన్నారు. వెంటనే బైక్‌పై వారిద్దరినీ రైల్వే ఆస్పత్రికి తీసుకువెళ్లాను. అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.      
–కిరణ్‌కుమార్, ప్రత్యక్షసాక్షి 

Advertisement

తప్పక చదవండి

Advertisement