పండుగపూట విషాదం | Sakshi
Sakshi News home page

పండుగపూట విషాదం

Published Thu, Jan 15 2015 4:43 AM

పండుగపూట విషాదం - Sakshi

తాండూరు రూరల్: సంక్రాంతి పండుగపూట ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పండుగ సామగ్రి  తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన తాండూరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముండే అయినపురం మొగులప్ప(52) స్థానికంగా ఓ కిరాణం దుకాణం నిర్వహిస్త్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

బుధవారం మధ్యాహ్నం ఆయన తాండూరుకు వచ్చి పండుగ సామగ్రి కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇందిరాచౌక్ వద్ద రోడ్డు దాటుతుండగా తాండూరు నుంచి డిపోకు వెళ్తున్న వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు(ఏపీ 28జడ్2598) ఆయనను ఢీకొంది. దీంతో బస్సు టైర్ల కిందపడిన మొగులప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు.

మొగులప్ప మృతి విషయం తెలుసుకున్న ఆయన కుటుంబీకులు, బంధువులు రాజీవ్‌కాలనీవాసులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ అభినవ చతుర్వేది వారికి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

పట్టణ ఇన్‌చార్జి సీఐ శివశంకర్, ఎస్‌ఐలు నాగార్జున, ప్రణయ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఘటనా స్థలానికి రావాలని, రూ.10 లక్షల పరిహారం ఇచ్చి మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సీఐ శివశంకర్ వారికి సర్దిచెప్పారు.
 
నష్టపరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు శాంతించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీకాంత్ తాండూరు ఆస్పత్రికి చేరుకొని మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. సంస్థ నుంచి పరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. మృతుడికి భార్య శకుంతల, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
 
సిగ్నల్  వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు..

 తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శి కృష్ణముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement