బదిలీల జీవోపై సర్కారుకు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

బదిలీల జీవోపై సర్కారుకు చుక్కెదురు

Published Tue, Jun 30 2015 3:53 AM

Transfers GO On Government catch him

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలపై గత నెల 18వ తేదీన జారీ చేసిన జీవో 57పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇది సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జీవోను సస్పెన్షన్‌లో ఉంచుతూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలను రాజకీయ అవసరాల బదిలీలుగా మార్చేయడమే కాకుండా బదిలీలను ఏకీకృతం చేసిన విషయం తెలిసిందే.

సాధారణంగా ఉద్యోగులను స్థాయి, కేడర్ ఆధారంగా ఆయా శాఖల మంత్రులు, శాఖాధిపతులు బదిలీలు చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవో 57తో బదిలీల ప్రక్రియను రాజకీయ వ్యవస్థీకృతం చేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు బదిలీలు చేస్తారని ఆ జీవోలో స్పష్టం చేసింది. అందుకోసం ఆగమేఘాల మీద జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నియామకం కూడా ప్రభుత్వం చేసింది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లోని ఉద్యోగులకు జిల్లాల్లో ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుందని, అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తారని జీవోలో పేర్కొన్నారు.

హైరార్కీ మేరకు ఏ స్థాయి ఉద్యోగిని ఎవరు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న అంశంపై సర్వీసు నిబంధనలున్నాయి. అయితే ప్రభుత్వం హైరార్కీ కాదని జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లకు బదిలీల ప్రక్రియను అప్పగించింది. దీనిపై పశుసంవ ర్ధక శాఖ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని జిల్లాల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ బదిలీలపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరారు.

దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. కాంతారావు ఈ నెల 26వ తేదీన జీవో 57ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఒక పశు సంవర్ధక శాఖకే కాదని, అన్ని శాఖలకు వర్తిస్తాయని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన బదిలీలు చెల్లుతాయా లేదా అనే అనిశ్చితి నెలకొందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement