మద్యం రవాణాపై డేగ కళ్లు..! | Sakshi
Sakshi News home page

మద్యం రవాణాపై డేగ కళ్లు..!

Published Sat, Mar 15 2014 11:55 PM

మద్యం రవాణాపై డేగ కళ్లు..! - Sakshi

రైళ్లలో సరిహద్దు మద్యం రాకుండా పకడ్బందీ చర్యలు
 రవాణాదారులపై నిఘా

 
 మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :  సార్వత్రిక, స్థానిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోకి అక్రమంగా మద్యం రాకుండా గట్టి నిఘా పెట్టారు. ముఖ్యంగా రైలు మార్గం ద్వారా వచ్చే మద్యంపై డేగ కళ్లు ఉంచారు. ఇక నుంచి రైల్వేస్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేయనున్నారు.
 
 ఎన్నికల్లో మద్యం ప్రధాన భూమిక పోషిస్తుందనే ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీనికి అరికట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్ధేశిత మద్యాన్ని మాత్రమే దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కోరినంత మద్యం ఇవ్వడానికి ఎన్నికల నియమావళి ప్రతిబంధకంగా మారింది. దీంతో జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. అయితే ఎన్నికల్లో మద్యం అనివార్యం కావడంతో కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో మద్యం రవాణాకు రంగం సిద్ధం చేశారు.
 
  సరిహద్దున ఉన్న మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతికి ఎత్తులు వేస్తున్నారు. రహదారి మార్గంలో పోలీసులు, మద్య నిషేధశాఖ అధికారుల తనిఖీలు ముమ్మర ంగా ఉండడంతో రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. రైలులో నిఘా అంతగా లేకపోవడంతో మద్యం రవాణా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. 1995లో మద్యపాన నిషేధం అమల్లో ఉండగా రైలు మార్గం ద్వారానే మద్యం అక్రమ రవాణా జరిగింది.
 
  ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా వ్యాపారులు అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లలో ఉత్తరం నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లే అనేక రైళ్లు నిలుస్తాయి. రైల్వే పోలీసుల నిఘా పెద్దగా లేకపోవడంతో అక్రమ వ్యాపారులు రైలును నమ్ముకున్నారు. పెద్ద ఎత్తున వ్యాపారం చేసి లాభాలు గడించాలనే యత్నంలో ఉన్నారు.
 
 
 చెక్ పెడతారిలా..
 అక్రమ వ్యాపారుల ఎత్తులను చిత్తు చేయడానికి  మద్య నిషేధ శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. రైలు మార్గం ద్వారా మద్యం రవాణాను నిరోధించడానికి నిఘా తీవ్రతరం చేశారు. అన్ని రైల్వే స్టేషన్‌లలో తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించారు. నిన్నటి వరకు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడిన మద్య నిషేధశాఖకు ప్రస్తుతం సిబ్బంది కొరత తీరింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూర్, కాగజ్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లలో 7గురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 22 మంది హెడ్ కానిస్టేబుల్‌లు, 70 మంది కానిస్టేబుల్‌లు ఉన్నారు. తగినంతా సిబ్బంది ఉండడంతో రైల్వేస్టేషన్‌లలో నిఘా పెంచాలని నిర్ణయించారు.
 
 ఆదివారం నుంచి సిబ్బందికి రైల్వేస్టేషన్‌లలో విధులు వేయనున్నారు.  మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే తూర్పు ప్రాంతాలను రైల్వే స్టేషన్‌లలో నిలిచే రైలు నుంచి దిగే అనుమానిత ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వెళ్లనివ్వాలని సిబ్బందికి మద్య నిషేధ శాఖ పర్యవేక్షకుడు శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో రైలు మార్గం నుంచి మద్యం అక్రమంగా రవాణా చేయాలని ఆశించిన అక్రమ మార్కులకు చెక్‌పడనుంది. ఏ మేరకు అక్రమ రవాణాను అధికారులు నియంత్రిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
 
 అక్రమ మద్యాన్ని అడ్డుకుంటాం
 ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం రవాణా చేయకుండా నిఘా కట్టుదిట్టం చేస్తున్నాం. సిబ్బంది కొరత తీరింది. నిఘా పెంచడానికి అన్ని ఏర్పాట్లు చేశాం.  అక్రమ వ్యాపారుల మార్గాలను నిరోధించి తీరుతాం. ఇప్పటికే గుడుంబా, అక్రమ మద్యం అమ్మకాలపై దృష్టి సారించాం. రైల్వేస్టేషన్‌లను లక్ష్యంగా చేసుకున్నాం. మహారాష్ట్ర నుంచి మద్యం రవాణా కాకుండా చూస్తాం.
 
 ఇప్పటికే 265 కేసులు నమోదు చేశాం. అందులో 3,768 నాటుసారా, 1,21, 450 గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం, 10 అనధికారంగా మద్యం అమ్ముతున్న దుకాణాలపై కేసు, 40 బీర్లు, 245 మద్యం సీసాలు, 65 కిలోల నల్లబెల్లం, 142 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాం.
 - శ్రీనివాస్, మద్య నిషేధశాఖ పర్యవేక్షకుడు, మంచిర్యాల
 
 

Advertisement
Advertisement