ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తా | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తా

Published Mon, Feb 16 2015 3:09 AM

ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తా

బాసర : బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బాసర ట్రీపుల్ ఐటీ కళాశాలను ఆదివారం ఆయన ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు మార్వేల్ మెస్ నిర్వాహకులు సరైన భోజనం అందించడం లేదని ఆందోళనకు దిగిన నేపథ్యంలో వారు కళాశాలను సందర్శించారు. సుమారు 2 గంటలపాటు మెస్ కేఏంకే, మార్వేల్‌లోని కూరగాయాల స్టోరేజ్, వంట గదులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం తనిఖీ చేశారు. ఇంజినీరింగ్ ఈ2, ఈ3, ఈ4 విద్యార్థులతో మాట్లాడారు. మెస్ నిర్వాహకులు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థులు తెలిపారు.
 
 అనంతరం మంత్రి, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీనియర్ విద్యార్థులు మార్వేల్ మెస్ తీరుపై, సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్‌లో కళాశాలలో మరో మెస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మరో ఫిజికల్ డెరైక్టర్, ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. రూ.2 కోట్లు స్కాలర్‌షిప్ బకారుులు విడుదల చేయించేందుకు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, భైంసా డీఎస్పీ అందె రాములు, ట్రీపుల్ ఐటీ డెరైక్టర్ అప్పల నాయుడు, నాయకులు పీఏసీఎస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, జెడ్పీటీసీ సభ్యుడు సావ్లీ రమేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పోతన్న యాదవ్, బాసర మాజీ సర్పంచ్ రమేశ్, నూకం రామారావు, బాల్గాం దేవేందర్,   పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement