గులాబీలో ‘రచ్చ’ | Sakshi
Sakshi News home page

గులాబీలో ‘రచ్చ’

Published Sat, Nov 17 2018 12:08 PM

Internal Clashes In TRS Party - Sakshi

టీఆర్‌ఎస్‌ వికారాబాద్‌ అభ్యర్థి మెతుకు ఆనంద్‌కు టికెట్‌ ఇస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని రగిలిపోతున్నారు. పార్టీ టికెట్‌ ఆశించిన వారంతా ఆనంద్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టారు. గెలుపు గుర్రానికే అవకాశమివ్వాలని అధిష్టానానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు. పార్టీ ప్రారంభం నుంచి గులాబీ జెండా మోస్తున్న వారందరినీ కాదని,   కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రసాద్‌కుమార్‌ 
గెలుపుకు పరోక్షంగా పచ్చ జెండా ఊపారని ఆరోపిస్తున్నారు. 


వికారాబాద్‌/ధారూరు : ధారూరు మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఒకరిపై ఒకరు కుర్చీలు లేపుకొన్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ టికెట్‌ను డాక్టర్‌ మెతుకు ఆనంద్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న ఓ వర్గంలోని కొంతమంది నాయకులు అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తంచేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆనంద్‌ మద్దతుదారులు.. ఆందోళనకారులను కొట్టి తరిమేశారు.

ఫంక్షన్‌ హాల్‌నుంచి బయటకు వచ్చిన అసమ్మతి నాయకులు భయంతో పరుగులు పెట్టారు. వీరిని వెంబడించిన రెండోవర్గం నాయకులు వెంబడించి చితకబాదారు. ఇరువర్గాల వారు రోడ్డుపై పరుగు తీస్తున్న దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపించాయి. పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ రాంరెడ్డి ఎంతగా వారిస్తున్నా వినకుండా.. కొండాపూర్‌కలాన్‌ గ్రామ నాయకుడు వడ్డె యాదయ్యతో పాటు మరికొందరిపై దాడిచేసి తరిమికొట్టారు.

యాదయ్య వీరి నుంచి తప్పించుకుని పరుగుతీశాడు. కాగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ గొడవలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించబోమని వేణుగోపాల్‌రెడ్డి తన ప్రత్యర్థి వర్గాన్ని హెచ్చరించారు. అనంతరం సమావేశం ప్రారంభమైంది. అయితే టీఆర్‌ఎస్‌వీ జిల్లా ఇన్‌చార్జ్‌ కుమ్మరి శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది శ్రీనివాస్‌పై సమావేశం స్టేజీపైనే దాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ దృశ్యాలను రికార్డింగ్‌ చేస్తూ గొడవను అడ్డుకున్నారు. పార్టీ అభ్యర్థి డాక్టర్‌ ఆనంద్‌ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.  


ఎంత చెప్పినా వినకుండా... 
వికారాబాద్‌లో పోటీ మాజీమంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్‌ మధ్యే ఉంటుందని అధిష్టానానికి పదేపదే చెప్పినా తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ ధారూరు మండల శ్రేణులు శుక్రవారం రెండు వర్గాలుగా చీలిపోయాయి. హన్మంత్‌రెడ్డి, వండ్ల నందు వర్గానికి చెందిన నాయకుడు వడ్డె యాదయ్యను.. పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి వర్గీయులు కుర్చీలు, రాళ్లతో కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది క్షణాల్లో పార్టీ అభ్యర్థి ఆనంద్‌ సమావేశానికి వస్తారనే సమయంలో ఈ గొడవ చోటుకోవడం ఆయనపై ఉన్న అసమ్మతిని సూచించింది.

గాయాల పాలైన వడ్డె యాదయ్య వేణుగోపాల్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర కేసు నమోదైంది. టికెట్‌ వచ్చిందనే ఆనందం ఉన్నప్పటికీ.. అసమ్మతి నుంచి బయటపడేదెలా అంటూ ఆనంద్‌ తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ మారడమే ఉత్తమమని కొంతమంది టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొంతమంది అసమ్మతి నేతలు కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతుండగా.. మరి కొందరు స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్‌ వైపు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.  

1/1

అసమ్మతి నేతలను రోడ్డుపై తరుముతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

Advertisement
Advertisement