సమన్వయం కోసం త్రిసభ్య కమిటీ | Sakshi
Sakshi News home page

సమన్వయం కోసం త్రిసభ్య కమిటీ

Published Sat, May 10 2014 3:36 AM

సమన్వయం కోసం త్రిసభ్య కమిటీ - Sakshi

 వరంగల్, న్యూస్‌లైన్ : స్థానిక, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణను టీఆర్‌ఎస్ సిద్ధం చేసిం ది. మునిసిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంప్‌ల నిర్వహణ తదితర అంశాలను సమన్వయం చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిలకు స్థానం కల్పించారు. జెడ్పీటీసీల బాధ్యత జిల్లా అధ్యక్షుడికి, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్‌ల భాధ్యత పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు అప్పగించారు. జెడ్పీ చైర్మన్, వైఎస్ చైర్మన్‌లను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారు. ఎమ్మెల్యే, ఎంపీ ఫలితాలు రాగానే విజయం సాధించిన అభ్యర్థులు 17వ తేదీన తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేసిన అభ్యర్థులు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, వినయభాస్కర్, డాక్టర్ రాజయ్య, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అజ్మీరా చందూలాల్, మధుసూదనాచారి, కొండా సురేఖ, సహోదర్‌రెడ్డి, శంకర్‌నాయక్, డాక్టర్ సుధాకర్‌రావు, సత్యవతిరాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement