యువతపైనే దేశ భవిష్యత్‌ | Sakshi
Sakshi News home page

యువతపైనే దేశ భవిష్యత్‌

Published Fri, Nov 9 2018 11:52 AM

TRS Candidate Errabelli Dayakar Rao Campaign,Warangal - Sakshi

సాక్షి,రాయపర్తి: దేశ భవిష్యత్‌ యువతపైనే ఉంది.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని  పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని వికాస్‌స్కూల్‌ గ్రౌండ్‌లో గురువారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ మండల యువగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. యువత చెడు పార్టీల్లో తిరిగి తమ విలువైన భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. లక్షలు వెచ్చించి పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించాను.. ఆదరించి గెలిపిస్తే మంత్రి పదవితో వచ్చి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అలా కాదంటే రూ.10లక్షల సబ్సిడీ రుణాలను అందించి ఆర్థికాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.  

ఉద్యోగం వచ్చేవరకు యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేలు అందిస్తామని చెప్పారు. తాను 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి మచ్చలేని నాయకుడిగా ఎదిగాను.. మీ తల్లిదండ్రులు నాకోసం పనిచేశారు.. మీ కోరిక మేరకు ఈ ఒక్కసారి బరిలో నిలబడుతున్నాను.. ఆశీర్వదించి 50వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల కాలంలో పాలకుర్తి నియోజకవర్గానికి అధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పథంలో నడిపించాను.. మళ్లీ అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా డైరెక్ట్‌గా నా దగ్గరకు రావచ్చని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం మండల అధ్యక్షుడు సాగర్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజు, కోఆర్డినేటర్‌ నవీన్, ప్రధాన కార్యదర్శి సంతోష్‌గౌడ్, శ్రావన్, సతీష్, అష్రఫ్, పార్టీ మండల అధ్యక్షుడు అనిమిరెడ్డి, ఆకుల సురేందర్‌రావు, పనికర మల్లయ్య, వనజారాణి, ఉస్మాన్, సుధాకర్, గారె కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement