ఆదిలాబాద్‌: ఊరూ..వాడా ప్రచారం | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌: ఊరూ..వాడా ప్రచారం

Published Sat, Dec 1 2018 2:15 PM

TRS, Congress, BJP Parties Election Campaign In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌(బేల): శాసనసభ ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో ఆయాపార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు వ్యూహరచనలతో ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు అండగా ఒకవైపు ఆ పార్టీల గెలుపు లక్ష్యంగా ఆయాపార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు నియోజక వర్గాల కేంద్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచా రానికి కొండంత అండగా నిలుస్తున్నారు. మరోవైపు గ్రామగ్రామాల్లో ప్రచార రథ మైక్‌లు, డీజే చప్పుడ్లతో ప్రచారాలను ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు హోరెత్తిస్తున్నారు.

గ్రామగ్రామాల్లో ముమ్మరంగా ప్రచారాలు..
ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులే, ఇతర సన్నిహితులు కూడా గ్రామగ్రామాల్లో ప్రధాన కూడళ్లు, ఇంటింటా తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గెలుపుకోసం ఎవరికి వారు తమవంతు కృషి చేసుకుంటున్నారు.

అదనపు హంగులు..
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో గతంకంటే ఈసారి వినూత్నంగా డిజిటట్‌ హంగులు తోడవంతో ప్రచారం డిజిటల్‌మయంగా మారింది. ప్రచార రథాలకు భారీ డిజే సౌండ్స్‌తోపాటు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో, ప్రధాన వీధుల మార్గాలు, కూడళ్లలో తిప్పుతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా అభ్యర్థుల ఫొటోలు, ఫ్లెక్సీలు, మాస్కులు, టోపీలు, పార్టీ గుర్తుల బిల్లలు, టీషర్ట్‌లతోపాటు విభిన్న రూపాలతో వినూత్నంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆది లాబాద్‌ నియోజక వర్గంలో మరాఠీ మాట్లాడే వారుండడంతో, మరాఠీ రికార్డింగ్‌ పాటలతో కూడా ప్రచారం చేయిస్తున్నారు.

కళాకారుల ఆటపాటలు..
ఆయా పార్టీలకు మద్దతుగా జానపద కళాకారులు ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అచ్చమైన పల్లెపాటలతో నృత్యాలతో ప్రచారానికి హోరెత్తిస్తూ పార్టీలపై ఆదరణ తెస్తున్నారు.

త్రిముఖ పోరు
ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. విజయంకోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల సర్వశక్తులు ఒడుతున్నారు. కాగా జోగు రామన్న ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలు పొందారు. ప్రస్తుతం నాలుగోసారి బరిలో టీఆర్‌ఎస్‌ తరపున ఉన్నారు. గండ్రత్‌ సుజాత 1999 సంవత్సరంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి, ఓటమిపాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రచారం సాగిస్తున్నారు. పాయల్‌ శంకర్‌ కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి, ఓటమి చవిచూశారు. ఈసారి ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ముం దుకు సాగుతున్నారు. ముగ్గురిలో ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో వేచిచూడాలి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement