ఐదో ఎమ్మెల్సీ సీటుకు టీఆర్‌ఎస్ దూరం! | Sakshi
Sakshi News home page

ఐదో ఎమ్మెల్సీ సీటుకు టీఆర్‌ఎస్ దూరం!

Published Mon, May 18 2015 4:57 AM

ఐదో ఎమ్మెల్సీ సీటుకు టీఆర్‌ఎస్ దూరం! - Sakshi

* నాలుగు స్థానాలతోనే సరిపెట్టుకోవాలని యోచన
అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న సందిగ్ధత
తెరపైకి దేవీప్రసాద్ పేరు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు (ఎమ్మెల్యే కోటాలో) జూన్ 1న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల గడువు ముగియనున్నా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం నాలుగు ఎమ్మెల్సీ పదవులను టీఆర్‌ఎస్ సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు స్థానాలను మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావులకు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుండగా మరో రెండు సీట్లలో మాత్రం ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై అధినాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఒక ఎమ్మెల్సీని కాంగ్రెస్ గెలుచుకోవడం ఖాయంకాగా టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి మాత్రం రెండు ఓట్లు తక్కువ అవుతున్నాయి.
 
 ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే ఐదో ఎమ్మెల్సీ కోసం అభ్యర్థిని బరిలోకి దింపడమా, మానడమా అనే విషయంలో టీఆర్‌ఎస్ నాయకత్వం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు తేలిగ్గా వచ్చే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలతో సరిపెట్టుకోవాలని, ఐదో ఎమ్మెల్సీ కోసం పోటీకి దిగి రిస్కు తీసుకోదలచుకోలేదని తెలుస్తోంది. ఈ లెక్కన టీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంటున్నట్లేనని అనుకుంటున్నారు. దీంతో ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 
 20వ తేదీ లోగా పేర్ల ఖరారు
 శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన టీఎన్‌జీవోల మాజీ నేత దేవీప్రసాద్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కొందరు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరినట్లు సమాచారం. అయితే దీనిపై కేసీఆర్ ఇంకా తన నిర్ణయాన్ని బయట పెట్టలేదు. గవర్నర్ కోటాలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ను కూడా ఎమ్మెల్యే కోటాలోనే సర్దుతారని తెలుస్తోంది.
 
 వీరి పేర్లు ఒకవేళ ఖాయమైతే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎ.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన బోడకుంటి వెంకటేశ్వర్లు వంటి నేతలకు ఎలా సర్దుబాటు చేస్తారన్న ప్రశ్నలకు పార్టీ వర్గాల వద్ద సమాధానం లేదు. మరోవైపు తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన న్యాయవాదులకూ గుర్తింపు ఇవ్వాలని, జేఏసీ కో కన్వీనర్‌గా ఉన్న న్యాయవాది శ్రీరంగారావుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని న్యాయవాద సంఘాల నేతలు ఆదివారం సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. అభ్యర్థిత్వాల ఖరారు ఆలస్యమయ్యేకొద్దీ కొత్త పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని, ఈనెల 19, 20 తేదీల్లో నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement