హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం

Published Tue, May 5 2015 2:44 AM

సోమవారం నారాయణపురంలో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు - Sakshi

- చిత్తశుద్ధి లోపిస్తే ‘మిషన్ కాకతీయ’ ఓ చెత్త కార్యక్రమం
- రైతుల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
- వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
 
కల్లూరు:
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, ఏ సంక్షేమ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం ఖమ్మం జిల్లా కల్లూర్ మండలం నారాయణపురంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోగా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. రైతులు పంట ఉత్పత్తులను దళారులకు తక్కువ రేటుకు అమ్ముకోలేక మార్కెట్‌లకు తీసుకొస్తుంటే అక్కడ వెంటనే కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. రుణమాఫీ ఒకేసారి చేసి, రైతులకు కొత్తగా పంట రుణాలు అందచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాణ్యత గల ఎరువులు, విత్తనాలు జిల్లాకు ఎంత అవసరమో గుర్తించి పంపిణీ చేయాలన్నారు.

వాటర్ గ్రిడ్‌తో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హంగామా చేస్తోందని, ఆ పనులు పూర్తయ్యేసరికి నాలుగేళ్లు పడుతుందన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్ని గుర్తించి నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికి వైద్యం చేయించాలని, మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. చెరువులు అభివృద్ధి చెందుతాయన్నారు. చిత్తశుద్ధి కొరవడితే మాత్రం అంతటి చెత్త కార్యక్రమం ఇంకొకటి ఉండదన్నారు.

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని కలలు కన్నారని, వాటిని సాఫల్యం చేయడానికే ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ ప్రతిపక్షపాత్ర పోషిస్తుందన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి కీసర వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement