చేనేతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం | Sakshi
Sakshi News home page

చేనేతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

Published Thu, Apr 13 2017 12:07 AM

చేనేతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - Sakshi

సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తాం: కేటీఆర్‌
బడ్జెట్లో చేనేతకు భారీ కేటాయింపులు చేశాం
14,300 చేనేత మగ్గాలకు జియోట్యాగింగ్‌  


సాక్షి, హైదరాబాద్‌: చేనేత కార్మికులను కాపాడు కోవడమే ప్రభుత్వ చేనేత విధాన ప్రాథమిక లక్ష్యమని చేనేతశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. చేనేత రంగంలో లాభదా యకత లేకుంటే ఇతర రంగాలకు తరలి వెళ్లేందుకు కూడా తాము సహకారం అందిస్తామని అన్నారు. బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో చేనేత, టెక్స్‌టైల్‌ శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ.. ఇతర రంగాల్లోకి వెళ్లే కార్మికులకు ప్రత్యేక సబ్సిడీలతో కూడిన రుణాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నామని, చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయిం పులు చేశామన్నారు. ఇందులో ఎలాంటి లీకేజీలు లేకుండా చూడాలని, ఆధార్, బయో మెట్రిక్‌ ఆధా రంగా నేరుగా వారి బ్యాంకుల్లో సబ్సిడీ చేరేలా పాలసీలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

చేనేత డైరెక్టరీ తయారు చేయాలి
సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చేనేత స్థితిగతుల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి, చేనేత డైరెక్టరీని తయారు చేయాలని సూచించారు. ఈ నివేదికలో రాష్ట్రంలో ఉన్న చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలతో కూడిన పూర్తి గణాంకాలు, అంచనాలతో కూడిన సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. ప్రసుత్తం రాష్ట్రంలో నిర్వహిస్తున్న చేనేత మగ్గాల సర్వేలో 17,000 చేనేత మగ్గాలున్నాయని.. ఇప్పటికే 14, 300 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ చేసినట్లు మంత్రి తెలిపారు.

చేనేతలకు సబ్సిడీలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. తమ ఉత్ప త్తులను ప్రభుత్వానికే కాకుండా బయట మార్కెట్లో అమ్ముకునే అవకాశాన్ని సైతం కల్పిస్తామని, ప్రభుత్వమే మాస్టర్‌ వీవర్‌ పాత్రను పోషించాలని మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, టెక్స్‌టైల్‌ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement