కమిటీలు లేని కారు | Sakshi
Sakshi News home page

కమిటీలు లేని కారు

Published Sun, May 10 2015 1:35 AM

TRS has no commities

- టీఆర్‌ఎస్‌లో ఖరారుకాని కార్యవర్గాలు
- పార్టీ పదవులపై గులాబీ శ్రేణుల ఆశలు
- జిల్లా కమిటీల కోసం ఎదురుచూపు
- దృష్టి పెట్టని ముఖ్య నేతలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ :
అధికార టీఆర్‌ఎస్‌లో వింత పరిస్థితి నెలకొంది. మూడు నెలలుగా పార్టీకి జిల్లా కమిటీలు లేవు. 14 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న 2008, 2009 ఎన్నికల సమయాల్లోనూ కమిటీలు లేకుండా లేదని టీఆర్‌ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇటీవలే పూర్తయ్యింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి చేపట్టిన సంస్థాగత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. భారీ స్థాయిలో కార్యకర్తలను సభ్యులుగా నమోదు చేయించింది.

సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కోసం ఎప్పటిలాగే.. పార్టీ కమిటీలను రద్దు చేసి అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 3న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అన్ని స్థాయిల్లోని కమిటీలు రద్దయ్యాయి. అనంతరం సభ్యత్వ నమోదు నిర్వహించారు. గ్రామ, మండల కమిటీల ఎన్నికలను పూర్తి చేశారు. ఏప్రిల్ 16న జిల్లా కమిటీల ఎన్నిక జరిగింది. వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా తక్కళ్లపల్లి రవీందర్‌రావు, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షుడిగా నన్నపునేని నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మంత్రి ప్రకటించినా..
జిల్లా కమిటీలోని మిగిలిన పదవుల విషయంలో స్పష్టత రావడంలేదు. రెండు, మూడు రోజుల్లో జిల్లా కమిటీల కార్యవర్గాల ఎన్నిక పూర్తవుతాయని.. జిల్లా కమిటీల ఎన్నికలకు పరిశీలకుడిగా వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డి ప్రకటించారు. ఇది జరిగి 20 రోజులు దాటినా ఇప్పటికీ జిల్లా కమిటీలను ప్రకటించలేదు. అధికార పార్టీకి జిల్లా కమిటీలను ప్రకటించకపోవడంతో ఈ పదవులను ఆశిస్తున్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 24న ప్లీనరీ జరిగింది. టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యింది. ఈ ఎన్నికకు ముందే పార్టీ జిల్లా కమిటీలను ప్రకటించాల్సి ఉంది. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో కమిటీలను ప్రకటించలేదు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ బహిరంగసభ తర్వాత కమిటీలను ఏర్పాటు చేస్తారని ఆశావహులు భావించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మళ్లీ కలిసి కూర్చుని చర్చించే ఆలోచన చేయకపోవడంతో కమిటీల ప్రక్రియ ఎంతకీ ఇది పూర్తి కావడంలేదు.

ఆశావహుల్లో నిరాశ
టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల నియమావళి ప్రకారం.. జిల్లా కమిటీలో 33 మంది చొప్పున ఉంటారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు కార్యదర్శులు, ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు ప్రచార కార్యదర్శులు, ఒక కార్యాలయ కార్యదర్శి, ఒక కోశాధికారి, 17 మంది కార్యవర్గ సభ్యులు ఉంటారు. జిల్లా కమిటీలో, గ్రేటర్ వరంగల్ కమిటీలోనే ఇంతే సంఖ్యలో నాయకులకు చోటు కల్పిస్తారు. రెండు కమిటీలకు పార్టీ అనుబంధ సంఘాలు ఉంటాయి. ఇలా వందల మందికి జిల్లా కమిటీల్లో చోటు దక్కుతుంది.

దీన్ని వాయిదా వేస్తుండడంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘పార్టీలోని మొదటి నుంచి పని చేస్తూ వస్తున్న వారికి ప్రభుత్వంలో పదవులు వస్తాయని ఆశతో ఉన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ఇవి ముందుగా దక్కుతున్నాయి. ఇప్పుడు పార్టీ పదవులు ఇస్తారని అనుకుంటున్నా కార్యవర్గాలే ప్రకటించడంలేదు’ అని టీఆర్‌ఎస్ గత కమిటీలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కమిటీలను త్వరగా ప్రకటించేందుకు జిల్లాలోని ముఖ్య నాయకులు ప్రయత్నించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement