ఆశల పల్లకీలో గులాబీ నేతలు | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకీలో గులాబీ నేతలు

Published Tue, May 27 2014 2:14 AM

trs leaders focus on nominated posts

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  టీఆర్‌ఎస్ నేతలు నామినేటెడ్ పోస్టులపై గురి పెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు ఎలాగైనా పదవులను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోస్తు న్న ద్వితీయ శ్రేణి నేతలు ప లువురు తమ స్థాయిని బట్టి పదవులను ఆశిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రాపకా న్ని ముందే పొందిన నేతలు నామినేటెడ్ పదవులపై
ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం అనివార్యంగా మారిన నేపథ్యంలో ఏ ప్రాతిపదికను పాటిస్తారోనన్న చర్చ జరుగుతోంది.

 ‘ఎమ్మెల్సీ’ ఎవరిని వరించేనో..
 జిల్లాలో రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలిచి టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆధిష్టానం రాజకీయంగా, అభివృద్ధి పరంగా జిల్లాకు ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా కింద జిల్లాకు చెందిన నాయకుడికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు కోసం పలువురు సీనియర్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు.

 నిజామాబాద్ అర్బన్, రూరల్‌ల నుంచి టికెట్ ఆశించిన బస్వా లక్ష్మీనర్సయ్య, డాక్టర్ భూపతిరెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ప్రకటించిన ఐదారు రోజులకే బస్వా లక్ష్మీనర్సయ్య కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఎమ్మెల్సీ రేసులో జిల్లాకు చెందిన డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌లు మిగిలారు. అలాగే టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలు ఈ పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 మార్కెట్ కమిటీ, కార్పొరేషన్లపైన..
 పలువురు సీనియర్ నేతలు రాష్ర్ట, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులపై గురి పెట్టారు. ఆగ్రోస్, ఆర్టీసీ తదితర కార్పొరేషన్ల చైర్మన్లు, డెరైక్టర్ల స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి పదవుల వేటలో పడేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. డీపీసీ, విజిలెన్స్ మానిటరింగ్, జడ్పీ, మండల, కార్పొరేషన్, మున్సిపాలిటీలలో కోఆప్షన్ సభ్యుల కోసం కొందరు ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలను కలిసి, తమ పేర్లను ప్రతిపాదించాలని కోరుతున్నారు.

 నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, పిట్లం, గాంధారి తదితర ఏఎంసీల చైర్మన్, డెరైక్టర్ పదవుల కోసం సిఫారసులు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నిట్టు వేణుగోపాల్‌రావు, పున్న రాజేశ్వర్‌లతో పాటు అన్ని నియోజకవర్గాల నాయకులు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ద్వితీయశ్రేణి నాయకులు చక్కర్లు కొడుతున్నారు. వీరి ఆశలను కేసీఆర్ ఏ విధంగా నెరవేరుస్తారో వేచి చూడాలి.

Advertisement
Advertisement