ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?: హరీశ్‌ రావు | Sakshi
Sakshi News home page

ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?: హరీశ్‌ రావు

Published Fri, Mar 10 2017 11:38 AM

ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?: హరీశ్‌ రావు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సభలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శాసన సభ గౌరవాన్ని కాంగ్రెస్‌ మంటగలిపిందని మండిపడుతూ వారి చర్యను ఖండించారు. గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుతగలొద్దని, హుందాగా వ్యవహరించాలని గత బీఏసీ సమావేశాల్లోనే అందరి సమక్షంలో నిర్ణయించామని, అయినా ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. స్లోగన్‌లతో సభలో గందరగోళానికి యత్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్‌ రావు ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూస్తే..

‘మేం ఎన్ని రోజులైనా చర్చకు రెడీ. ప్రతి అంశంపై చర్చ పెడతామని ఇప్పటికీ చెబుతున్నాం. గతంలో అది చేశాం.. ఇప్పుడు కూడా చేస్తాం. స్పీకర్‌ కూడా అన్ని పక్షాలకు ఈ విషయాన్ని చెప్పారు. గతంలో బీఏసీలో గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగులొద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్‌, టీడీపీ ఎందుకు స్లోగన్స్‌ ఇచ్చింది? ఎందుకు ఆ తొందరపాటు? చిలిపిచేష్టలు ఏ ఉద్దేశంతో చేశారు? గిల్లికజ్జాలతో సభను ఎందుకు డిస్ట్రబ్‌ చేయాలని అనుకున్నారు? ఏదైనా చెప్పాలనుకుంటే రేపు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పేటప్పుడు చెప్పవచ్చు కదా. అప్పుడు మీకు చాలా సమయం ఉంటుందిగా. మీకు భయం.. ఎందుకంటే పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రతిపక్షాలు క్లీన్‌ బోల్డ్‌ అయ్యాయి. ఇప్పుడు కూడా అవుతాయని భయపడ్డాయి. కుల వృత్తుల కోసం బడుగుల కోసం త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తుంటే వణికిపోతున్నారు. తమను మెచ్చుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రతిపక్షాల చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement