పాంచ్ పటాకా | Sakshi
Sakshi News home page

పాంచ్ పటాకా

Published Tue, Jun 2 2015 1:55 AM

పాంచ్ పటాకా - Sakshi

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా
 
కాంగ్రెస్‌కు ఒక స్థానం ఓటమి పాలైన టీడీపీ
మొత్తం పోలైన ఓట్లు 118
పోలింగ్‌కు దూరంగా  సీపీఐ, సీపీఎం
టీడీపీకి పోలైంది 15 ఓట్లు
చెల్లని 1 టీడీపీ, 5 బీజేపీ ఓట్లు

 
హైదరాబాద్: అందరూ ఊహించినట్లుగానే జరిగింది. రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన అభ్యర్థిని గెలిపించుకోగా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ మాత్రం తన అభ్యర్థి ఓటమితో అభాసుపాలైంది. అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకుగాను    సీపీఐ, సీపీఎంకు చెందిన చెరో ఎమ్మెల్యే ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో 118 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లను అభ్యర్థులకు పంచగా ఒక్కో అభ్యర్థి విజయానికి 17 (16.86) ప్రథమ ప్రాధాన్య ఓట్లు అవసరమని తేల్చారు. టీఆర్‌ఎస్ తాను పోటీకి పెట్టిన అభ్యర్థులైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డిల విజయానికి అవసరమైన 85 ఓట్లను (ఒక్కొక్కరికీ 17 ఓట్ల చొప్పున) ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సమీకరించుకొని ఐదు స్థానాలనూ గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 18 ఓట్లు ఆ పార్టీ అభ్యర్థి ఆకుల లలితకే పోలయ్యాయి. మొత్తం ఆరుగురు అభ్యర్థుల్లో ఆమెకే అత్యధిక ఓట్లు లభించాయి. దీంతో ఈ ఆరుగురు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి 15 ఓట్లు పోలైనా, వాటిలో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి.

నోటా తెచ్చిన తంటా
విజయానికి కావాల్సిన 17 ఓట్లలో టీడీపీ అభ్యర్ధికి 15 ఓట్లు పోలైనా, వాటిలో ఆరు చెల్లని ఓట్లుగా అధికారులు తేల్చారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే రెండో ప్రాధాన్యత కింద నోటాకు ఓటు వేయడంతో అవి చె ల్లకుండా పోయాయి. దీంతో టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 9 మాత్రమేనని అధికారులు తేల్చారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నోటాకు ఓటేయడంతో ఈ పరిస్ధితి తలెత్తింది.

 ఉదయం నుంచే కోలాహలం
సోమవారం ఉదయం నుంచే అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉదయం ఎనిమిది గంటలకే  శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో ఏజెంట్లుగా ఉన్న ఐదుగురితో ఆయన భేటీ అయ్యారు. పోలింగ్ 9 గంటలకు మొదలుకాగా, శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి తొలి ఓటు వేశారు. టీఆర్‌ఎస్ ఐదుగురు అభ్యర్థులకు ఓట్లేయాల్సిన వారిని 17 మందిని ఒక గ్రూపు చొప్పున విభజించారు. ఈ గ్రూప్‌కు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, కె.తారక రామారావులు తమ గ్రూపు ఎమ్మెల్యేలతో ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లారు.

ఉదయం 11 గంటలకల్లా పోలింగ్ దాదాపుగా పూర్తయ్యింది. రేవంత్‌రెడ్డి సహా టీడీపీ ఎమ్మెల్యేలు అంతా కలసి ఒకేసారి ఓటింగ్ వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 మంది సైతం ఒకేసారి మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో వచ్చి ఓట్లేశారు. ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యేలతో మంత్రి హరీశ్‌రావు కలసి వెళ్లి ఓట్లేశారు. అందరి కంటే ఆఖరుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ఓటును మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 118 ఓట్ల పోలింగ్ పూర్తయింది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement