జూన్ 1 అర్థరాత్రి నుంచే ధూం ధాం | Sakshi
Sakshi News home page

జూన్ 1 అర్థరాత్రి నుంచే ధూం ధాం

Published Sat, May 31 2014 2:10 AM

trs plans to celebrate telangana appointed date from june 1st midnight

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జూన్ 1 అర్ధరాత్రి నుంచే ఘనంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజాలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ముఖ్య నేతలంతా ఈ సంబరాల్లో పాల్గొననున్నారు. ఆరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి 1.30 వరకు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుక కార్యక్రమాలను వారు వివరించారు.
 ్హ జూన్ 1న అర్ధరాత్రి ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తాం. ముంబయి నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచాలతో సంబరాలు నిర్వహణ. జంట నగరాల్లోని 25 కేంద్రాల్లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు సంబంధించి 50 భారీ కటౌట్లు, వెయ్యికిపైగా హోర్డింగుల ఏర్పాటు. అలాగే వంద చోట్ల స్టేజీలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. అన్నదానం, స్వీట్ల పంపిణీ.
 ్హ జూన్ 2న హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని మండల, గ్రామాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు జాతీయ జెండాతోపాటు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
 ్హ ఆరోజు కేసీఆర్ ఉదయం 7.30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి గన్‌పార్క్‌కు వచ్చి అమర వీరులకు నివాళులు అర్పిస్తారు. 8.10 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణం చేస్తారు. 10.40 గంటలకు పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ వేడుకల్లో పాల్గొంటారు.
 

Advertisement
Advertisement