దారులన్నీ కొంగర కలాన్‌ వైపే.. | Sakshi
Sakshi News home page

దారులన్నీ కొంగర కలాన్‌ వైపే..

Published Fri, Aug 31 2018 2:40 AM

TRS prepares for high profile meet in style - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సెప్టెంబర్‌ 2 ఆదివారం. వీకెండ్‌కు కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. సిటీ బస్సులోనో, క్యాబ్‌లోనో ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నారా... వచ్చే ఆదివారం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారా.. అయితే, మీ వీకెండ్‌ టూర్‌ను తప్పకుండా వాయిదా వేసుకోవలసిందే! సొంత వాహనం ఉంటే తప్ప ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ రోజు ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు మినహా చాలా వరకు రోడ్డు రవాణా సదుపాయాలు స్తంభించే అవకాశం ఉంది. అత్యధిక వాహనాలు కొంగరకలాన్‌ వైపు దారులకు బారులు తీరనున్నాయి.

సెప్టెంబర్‌ 2న కొంగర కలాన్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభకు జనసమీకరణ కోసం వాహనాల సేకరణలో పార్టీనేతలు , ఆర్టీఏ అధికారులు తలమునకలై ఉన్నారు. హైదరాబాద్‌ నుంచే 50 వేలకుపైగా వాహనాలను ఈ సభకు తరలించనున్నారు. ఈ దిశగా ఆర్టీఏ, తదితర విభాగాల అధికారయంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. ఆర్టీసీ బస్సులతోపాటు, స్కూల్‌ బస్సులు, వ్యాన్‌లు, డీసీఎంలు, మెటడోర్‌లు, క్యాబ్‌లు, ట్రావెల్‌ బస్సులు, కార్లు, ఆటోలు తదితర అన్ని రకాల వాహనాలను సభ కోసం ముందస్తుగా బుక్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం అత్యవరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది.  

రూటు మారనున్న సిటీ బస్సులు....
గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ 3,550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1,050 రూట్లలో, 42 వేల ట్రిప్పులు తిరిగే సిటీ బస్సుల్లో రోజుకు 32లక్షల మంది ప్రయాణికు లు రాకపోకలు సాగిస్తారు. నగరంలోని అన్ని మారుమూల కాలనీలకు, శివారు ప్రాంతాలకు సిటీ బస్సు రవాణా ఉంది. సభ దృష్ట్యా 2,500కు పైగా బస్సులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సిటీ బస్సుల్లో తిరిగే సుమారు 20లక్షల మందికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్‌లు, ప్రధాన బస్‌స్టేషన్‌లు, ఆస్పత్రులకు వెళ్లే మార్గాల్లో కూడా బస్సు లు, క్యాబ్‌ల కొరత వల్ల ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టంగానే ఉంటుంది.  

స్కూల్‌ బస్సులన్నీ అటు వైపే...
సాధారణంగా మోటారు వాహన నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు తదితర విద్యాసంస్థలకు నడిపే బస్సులను ఇతర అవసరాలకు వినియోగించేందుకు అవకాశం లేదు. స్కూల్‌ బస్సులను పెళ్లిళ్లు, వేడుకలు, టూర్‌ల కోసం వినియోగించిన అనేక సందర్భాల్లో రవాణా అధికారులు కేసులు నమోదు చేస్తారు. పిల్లల భద్రత దృష్ట్యా వాటిని ఇతర అవసరాల కోసం వినియోగించవద్దనే నిబంధన ఉంది. కానీ, రవాణా అధికారులే ఆ నిబంధనలను పక్కన పెట్టి స్కూల్‌ బస్సులను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నారు. స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థలకు చెందిన సుమారు 10 వేల బస్సులను తరలించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ప్రైవేట్‌ బస్సులను కూడా ఈ సభ కోసం తరలించనున్నారు.

దూరప్రాంతాలకు కూడా ఆటంకమే...
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులన్నీ ఆదివారం కొంగరకలాన్‌కే దారితీయనున్నాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర బస్‌స్టేషన్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మరో 2000లకు పైగా ఆర్టీసీ బస్సులు కూడా స్తంభించనున్నాయి. దీంతో ఆదివారం పూట దూరప్రాంతాల ప్రయాణాలను కూడా ఉపసంహరించుకోవడం మంచిదని అధికారవర్గాలు సూచిస్తున్నాయి.


ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లే దిక్కు
రోడ్డు రవాణా సదుపాయాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉండడంతో నగరవాసులకు అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు మాత్రమే. కానీ, వాటి సేవలు పరిమితం. ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి మార్గంలో, నాంపల్లి– లింగంపల్లి–ఫలక్‌నుమా మార్గంలో మాత్రమే ఎంఎంటీఎస్‌ రైళ్లు తిరుగుతున్నాయి. రోజుకు లక్షా 60 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఉప్పల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌ రూట్లో తిరుగుతున్న మెట్రో రైళ్లలో రోజుకు 80 వేల మంది తిరుగుతున్నారు. ఈ రెండు రకాల రైలు సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ రోజు ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులను పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.   

Advertisement
Advertisement