కారు.. సారు.. పదహారు.. | Sakshi
Sakshi News home page

కారు.. సారు.. పదహారు..

Published Wed, Mar 13 2019 3:29 AM

This is the TRS slogan in the Lok Sabha elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలుచుకొని ఢిల్లీలో ప్రభుత్వాన్ని శాసిద్దామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సారు... కారు... పదహారు... ఢిల్లీలో సర్కారు’ నినాదంతో లోక్‌సభ ఎన్నికల్లో పని చేయనున్నట్లు చెప్పారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనను ప్రజలు మెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆశీర్వదించారు. ఓట్ల సద్ది కట్టి కేసీఆర్‌కు ఇచ్చారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్‌ పార్టీ కకావికలమైంది.

ఎన్నికలంటే కాంగ్రెస్‌ నేతలకు గుబులు పుడుతోంది. ఎండాకాలంలోనూ కాంగ్రెస్‌ వాళ్లకు చలి జ్వరం వస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవాలి. 16 మంది గులాబీ సైనికులను పార్లమెంటుకు ఎందుకు పంపాలో ప్రజలకు వివరించాలి. దేశంలో బడితే ఉన్న వాళ్లదే బర్రె. కేంద్రంలో రైల్వే మంత్రి ఏ రాష్ట్రం వారు ఉంటే రైళ్లన్నీ ఆ రాష్ట్రానికే వెళ్తాయి. తెలంగాణ ప్రభుత్వ పథకాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నాయి. వ్యవసాయం దండగన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సైతం సీఎం కేసీఆర్‌ అమలు చేసిన రైతు బంధు స్ఫూర్తితో అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు వచ్చి మన రాష్ట్రంలోని పథకాలను ప్రశంసించారు. మిషన్‌ భగీరథకు, మిషన్‌ కాకతీయకు కలిపి రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలోనూ ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఆ రాష్ట్రంలో మెట్రోరైలు ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. కాంగ్రెస్, బీజేపీ కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఢిల్లీలో మనతో కలసి వచ్చే వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారు 100 మంది ఎంపీల వరకు ఉన్నారు. కారు, సారు, పదహారు, ఢిల్లీలో సర్కారు మన ఎన్నికల నినాదం. రేపు ఢిల్లీ కోటపై జెండా ఎవరు ఎగరేయాలో మనం నిర్ణయించే పరిస్థితి ఉంటే మన రాష్ట్రానికి ప్రాజెక్టులు రావా? రాహుల్‌ గాంధీ ఏం చెబితే కాంగ్రెస్‌ ఎంపీలు అదే చేస్తారు. కాంగ్రెస్‌ ఎంపీలకు రాహుల్‌ గాంధీ ఉస్కో అంటే ఉస్కో.. లేకపోతే డిస్కో అంటే డిస్కో. కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే వారు ఢిల్లీకి గులాంలు. మన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే తెలంగాణ ప్రజలకు గులాంలు అవుతారు. 16 ఎంపీ స్థానాలు గెలిచి ఢిల్లీ గద్దెను శాసిద్దాం. వచ్చే లోకసభ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలి’అని కేటీఆర్‌ అన్నారు.  

Advertisement
Advertisement