రేపు టీఆర్ఎస్ కమిటీల నియామకం! | Sakshi
Sakshi News home page

రేపు టీఆర్ఎస్ కమిటీల నియామకం!

Published Sun, Nov 6 2016 2:23 AM

రేపు టీఆర్ఎస్ కమిటీల నియామకం! - Sakshi

తెలంగాణ భవన్‌లో ప్రకటించనున్న సీఎం కేసీఆర్
ఇప్పటికే జిల్లా, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఖరారు

 సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత కమిటీలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించనున్నారు. పొలి ట్‌బ్యూరో మినహా పార్టీకి చెందిన అన్ని స్థాయిల కమిటీలను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీపై కసరత్తు కొనసాగుతోందని.. దానిని కూడా పూర్తిచేసి తెలంగాణ భవన్‌లో సంస్థాగత కమిటీలను వెల్లడిస్తారని పేర్కొంటున్నాయి. వాస్తవానికి తొలుత జిల్లా కమిటీల అధ్యక్షులను మాత్రమే ప్రకటించి, తర్వాత ఒక్కొక్కటిగా కమిటీలను ప్రకటించాలని భావించారు.

శనివారం జిల్లా కమిటీలు, జిల్లా అనుబంధ సంఘాల కమిటీలను నియమిస్తారని భావించారు. కానీ జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలనూ ప్రక టించాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. దీంతో శనివారం ప్రకటన వాయిదా పడిందని తెలుస్తోంది. అంతేగాకుండా రాష్ట్ర స్థాయి కమిటీల కూర్పుపై సీఎం కసరత్తు కొనసాగుతుండటం కూడా కారణమంటున్నారు. రాష్ట్ర కమిటీకి ప్రాథమిక రూపం ఇచ్చేందుకు మంత్రులు కె. తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బి. వినోద్‌కుమార్ తొలుత కొంత కసరత్తు చేశారని చెబుతున్నారు. మొత్తంగా కమిటీకి సీఎం తుదిరూపు ఇవ్వనున్నారు. పొలిట్ బ్యూరో మినహా అన్ని స్థాయిల కమిటీలను సోమవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి.

జిల్లా కమిటీలపై స్పష్టత వచ్చాకే..
వాస్తవానికి జిల్లా క మిటీలపై పూర్తి స్పష్టత వచ్చాకే పార్టీ నాయకత్వం రాష్ట్ర కమిటీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయా జిల్లాల అధ్యక్షుల నియామకంపై తుది నిర్ణయానికి వచ్చాక కూడా ఒకటి రెండు జిల్లాల్లో నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థి, యువజన విభాగాల విషయంలో పోటీ ఏర్పడిందంటున్నారు. నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్‌లు ఈ విభాగాలకోసం తమ అనుయాయుల పేర్లను రెండేసి చొప్పున ఇవ్వడంతో ఎటూ తేలలేదని చెబుతున్నారు.

ఇక జిల్లా అధ్యక్షుల విషయంలో సామాజిక సమీకరణాల మేరకే, అన్ని వర్గాలకు అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని భావించడం వల్ల కూడా కమిటీల రూపకల్పనలో ఒకింత ప్రతిష్టంభన నెలకొందంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఎస్సీ వర్గాలకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని చూసినా నాయకులు దొరకని పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాళ్లూరి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారైనా.. పోటీ కొనసాగుతోందని చెబుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావులు తమ వారికోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఆదివారం సాయంత్రంలోగా పలు మార్పులు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement