నేటి నుంచి టీఆర్‌టీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టీఆర్‌టీ పరీక్షలు

Published Sat, Feb 24 2018 2:12 AM

TRT examinations from today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శనివారం నుంచి మార్చి 4వ తేదీ దాకా జరగనున్న పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం పదింటికి మొదలయ్యే పరీక్షలకు 9:15కల్లా, మధ్యాహ్నం 2:30 పరీక్షలకు 1:45కల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ‘‘హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్‌ ఐడీ కార్డు విధిగా వెంట తీసుకెళ్లాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలూ, అభరణాలూ తేవొద్దు. పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి’’ అని పేర్కొంది. తొలిరోజు శనివారం ఉదయం లాంగ్వేజ్‌ పండిట్‌ తెలుగు, మధాహ్నం స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పరీక్షలుంటాయి.

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లోనే అత్యధిక పోటీ
స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) పోస్టులు తక్కువున్నా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో వీటికి అధిక పోటీ నెలకొంది. 1,941 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,906 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) అభ్యర్థులు తక్కువగా ఉండటంతో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు మాత్రం పోటీ తక్కువే ఉంది. ఒక్కో పోస్టుకు 16.49 మంది పోటీ పడుతున్నారు. పోస్టుల్లో 80 శాతం జిల్లా స్థాయి లోకల్‌ పోస్టులే కావడంతో ప్రధాన పోటీ జిల్లా పరిధిలోనే ఉండనుంది. మిగతా 20 శాతం ఓపెన్‌ పోస్టుల్లో అన్ని జిల్లాల వారూ పోటీలో ఉంటారు. ఉపాధ్యాయ పోస్టులకు అత్యధిక పోటీ మహబూబ్‌నగర్‌లోనే నెలకొంది. జిల్లాలో 1,979 పోస్టులకు 42,529 మంది పోటీ పడుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) మినహా మిగతా అన్ని కేటగిరీల్లోనూ మహబూబ్‌నగర్‌లోనే అత్యధిక పోటీ నెలకొంది. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో నల్లగొండలో, ఎస్‌జీటీ పోస్టుల్లో మెదక్‌లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్లకు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 19,396 మంది, ఆ తర్వాత నల్లగొండలో 18,798 మంది పోటీ పడుతున్నారు. ఎస్‌జీటీ పోస్టులకు మహబూబ్‌నగర్‌లో 17,639 మంది, ఆ తర్వాత మెదక్‌లో 11,173 మంది పోటీ పడుతున్నారు.

ఓపెన్‌ కోటాకు అన్ని జిల్లాల్లో పోటీ
కొన్ని జిలాల్లో కొన్ని కేటగిరీలో పోస్టులు లేవన్న ఆందోళన ఈసారి అభ్యర్థులకు అవసరం లేదు. ఇతర జిల్లాలోని ఓపెన్‌ కోటా పోస్టు కోసం సొంత జిల్లాను వదిలి, ఇతర జిల్లాకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులిచ్చే జిల్లా ప్రాధాన్యాల ఆప్షన్‌ ప్రకారం ఆయా జిల్లాల్లోని ఓపెన్‌ కోటా పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులూ

పోటీలో ఉండేలా ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement