రెండో రోజూ అదే సీన్‌

28 Nov, 2019 03:14 IST|Sakshi
తమను విధుల్లోకి తీసుకోవాలని జనగాం చౌరస్తాలో దండం పెట్టి ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

డిపోల వద్ద కార్మికులను అడ్డుకున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె విరమించిన నేపథ్యంలో విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం తొలి డ్యూటీకి వస్తే అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగిన కార్మికులు.. బుధవారం మళ్లీ వచ్చారు. పోలీసులు అడ్డుకున్నా, అరెస్టు చేసినా భయపడకుండా బుధవారం 6 గంటలకే సంబంధిత డిపోల వద్దకు చేరుకోవాలన్న జేఏసీ నేతల పిలుపుతో సూర్యోదయం కంటే ముందే వారు డిపోల వద్దకు చేరుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన పోలీసులు కార్మికులను డిపోలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమ్మె విరమించినా తమను ఎందుకు అనుమతించడంలేదని వారితో వాగ్వాదానికి దిగారు. 97 డిపోల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. 

కొన్ని ప్రాంతాల్లో కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఇదే పరిస్థితి పునరావృతమైతే గురువారం కార్మికశాఖ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయనున్నట్లు కార్మికులు తెలిపారు. మరోవైపు విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు డిపోల ముందు ఆందోళన చేస్తున్నా అధికారులు మాత్రం తాత్కాలిక సిబ్బందితో యథాప్రకారం బస్సులు నడిపించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 73శాతం బస్సులు తిప్పినట్లు వారు పేర్కొన్నారు. 1,907 అద్దె బస్సులు సహా మొత్తం 6,564 బస్సులు తిప్పినట్లు తెలిపారు. 4,657 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,564 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు పేర్కొన్నారు. 6,488 బస్సుల్లో టిమ్‌ యంత్రాలు వాడారని, 68 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశారని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా