టీవీవీ నేత ఆజాద్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

టీవీవీ నేత ఆజాద్ అరెస్ట్

Published Sat, Jul 16 2016 1:51 AM

Tvv leader Azad's arrest

ములుగు : విద్యార్థిగా కొనసాగుతూ మావోయిస్టు భావాజాలంతో ఆ పార్టీ అగ్రనేతలకు సహకరిస్తున్న ములుగు మండలం మల్లంపల్లికి చెందిన విద్యార్థి నేత బౌతు ఓదేలు అలియాస్ ఆజాద్‌ను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. ఓదేలు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక ప్రణాళికతో గురువారం యూనివర్సిటీలో అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి తన కార్యాలయంలో శుక్రవారం అతడి అరెస్టు చూపారు. ఏఎస్పీ కథనం ప్రకారం... ఓదేలు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ(ఫిలాసఫీ) చదువుతున్నాడు. మావోయిస్టు సానుభూతి సంఘమైన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ విద్యార్థుల్లో మావోయిస్టు భావాలను రేకెత్తించాడు.


ఈ క్రమంలో టీవీవీ సభ్యులైన నర్సంపేట మండలం ఖ మ్మంపల్లికి చెందిన మిట్టగడప చిరంజీవి, ములుగు మండలం మల్లంపల్లికి చెందిన మేర్గు రాజుతోపాటు మరి కొంత మందితో కలిసి బయట విద్యార్థి సంఘం ముసుగులో పనిచేస్తూ మావోయిస్టు కార్యకలాపాలు, పార్టీ విస్తరణ, రిక్రూట్‌మెంట్‌లాంటి పనులను చేపట్టి పార్టీ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, కేకేడబ్ల్యూ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు గతంలో అనేక  విధ్వంసాలకు పాల్పడ్డాడు.

ఆజాద్‌పై నమోదైన కేసులు
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎర్రమట్టి క్వారీలో ప్రొక్లయిన్ దహనం, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో తాడ్వాయిలోని వనకుటీరంలో అటవీశాఖ జీపు, గుడిసె దహనం, మే నెలలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీ ప్రొక్లయిన్ దహనంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఓదేలుపై గతంలో అసెంబ్లీ ముట్టడి కేసు, ఉస్మానియా క్యాంపస్‌లో అల్లర్ల కేసు, గత ఏప్రిల్ నెలలో సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసు నమోదు కాగా జైలుకు వెళ్లొచ్చాడు. ఓదేలును పట్టుకోవడంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సై మల్లేశ్‌యాదవ్ కృషి చేసినట్లు తెలిపారు. కాగా ఇటీవల ములుగు పోలీసులు తనను ఇబ్బంది  పెడుతున్నారని ఓదేలు రాష్ర్ట హోంశాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఏఎస్పీ వెంట సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్సై మల్లేశ్‌యాదవ్, సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండర్ అశోక్, అసిస్టెంట్ కమాండర్ రాజేశ్, సిబ్బంది ఉన్నారు.
 

Advertisement
Advertisement