అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

Published Tue, Dec 2 2014 12:50 AM

Two farmers' suicide in the fact sheet

సాక్షి నెట్‌వర్క్: రాష్ర్టంలో రైతు ఇంట మృత్యుఘోష ఆగడం లేదు. పంట పోయిందనే బెంగ.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడగా, మరో రైతుకు గుండెపోటు వచ్చింది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన కర్నాల గంగ నర్సయ్య(42) గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. ఉపాధి లభించక తిరిగి వచ్చాడు. గ్రామంలో తనకున్న రెండు ఎకరాలోల సాగు చేసుకుంటున్నాడు.

ఈ ఏడాది సోయా వేయగా, పంట పోయి పెట్టుబడులు కూడా రాలేదు. అంతకు ముందు అప్పు చేసి రెండు బోర్లు వేసినా నీరు పడలేదు. అప్పు తీరే మార్గం కనిపించకపోవడం.. ముగ్గురు కూతుళ్లు పెళ్లీడుకు వచ్చి ఉండడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం సాంయత్రం ఉరి వేసుకున్నాడు. ఇదే జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన నల్లవెల్లి నడిపి బాల్‌రెడ్డి(46) ఇటీవల దుబాయ్ వెళ్లి తిరిగివచ్చాడు.

కౌలుకు తీసుకొని సాగు చేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. గల్ఫ్ వెళ్లేందుకు, సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. మనోవేదనకు గురై సోమవారం ఉరి వేసుకున్నాడు. ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన బూసిరెడ్డి సుధాకర్‌రెడ్డి(32) గతేడాది వ్యవసాయ పెట్టుబడుల కోసం రూ. 2 లక్షలు అప్పు చేశాడు.

మళ్లీ ఈ ఏడాది తనకున్న ఒకటిన్నర ఎకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పత్తి దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో అప్పులపై బెంగ పెట్టుకొని అనారోగ్యం పాలయ్యాడు. ఈ క్రమంలో సోమవారం గుండెపోటుకు గురయ్యాడు.
 

Advertisement
Advertisement